డీఆర్‌ఐ భేష్‌! 

5 Dec, 2018 02:31 IST|Sakshi

61వ వ్యవస్థాపక దినోత్సవంలో జైట్లీ కితాబు 

నైతిక ప్రమాణాలు పాటించాలని విచారణా ఏజెన్సీలకు హితవు 

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థకు పెనుముప్పుగా పరిణమించే కేసులను డీల్‌ చేసే డీఆర్‌ఐ(డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటిలిజెన్స్‌)పై ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రశంసల వర్షం కురిపించారు. దేశంలోని అన్ని విచారణా సంస్థలు, ఏజెన్సీల్లో డీఆర్‌ఐ మాత్రమే ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా పనిచేస్తోందని ఆయన కితాబిచ్చారు. డీఆర్‌ఐ 61వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన ప్రసంగించారు. కస్టమ్స్‌ చట్టాల ఉల్లంఘన, స్మగ్లింగ్‌ లాంటి నేరాలను విచారించే అత్యున్నత సంస్థ డీఆర్‌ఐకి ఆయన కొన్ని దిశానిర్దేశాలు చేశారు. అత్యున్నతమైన ప్రమాణాలు పాటించడం, విచారణను అతి గోప్యంగా ఉంచడం, పరిపూర్ణమైన సాధికార సంస్థగా మారాలన్న యోచనతో పనిచేయడం డీఆర్‌ఐకి చాలా అవసరమని సూచించారు. 

రచ్చ మంచిది కాదు 
ప్రాథమిక విచారణ ఆరంభం కాగానే తాము కనుగొన్న విషయాలను మీడియాకు వెల్లడించాలన్న దుగ్ధను ఆపుకోవాలని ఏజెన్సీ అధికారులకు అరుణ్‌జైట్లీ చురకలు వేశారు. ప్రతిచిన్న విషయాన్ని తుర్రుమంటూ మీడియా ముందు పంచుకోవడం సబబు కాదన్నారు. ఏజెన్సీలంటే అత్యున్నత వృత్తి ప్రమాణాలు పాటించాలని, అంతేకాని విచారణకు అవరోధాలు కలిగించేలా రచ్చకెక్కడం మంచిది కాదని చెప్పారు. ఇలా మీడియా ముందుకు పరిగెత్తే బదులు విచారిస్తున్న కేసులో బలమైన సాక్ష్యాలు సంపాదించేందుకు యత్నించాలన్నారు. విచారణాధికారులు గుట్టుచప్పుడు కాకుండా ఎంక్వైరీ జరపాలని హితవు చెప్పారు. నేరాన్ని రుజువు చేసి దోషులకు జరిమానాలు, శిక్షలు పడేలా చేయడమే ఏజెన్సీలకు అసలైన పరీక్షని చెప్పారు. మీడియా దృష్టి పడకుండా విచారణ సాగించడమే అధికారులకు మంచిదని జైట్లీ చెప్పారు.

స్వీయ నియమావళి కీలకం 
విచారణా సంస్థల చుట్టూ వివాదాల ముసురు ముట్టిన వేళ ఇకపై అనవసరమైన ఆరోపణలు రాకుండా ఉండేందుకు కొన్ని నైతిక నియమాలుండాలని అరుణ్‌ జైట్లీ ప్రతిపాదించారు. ఒక అంశంపై విచారణ జరుగుతున్నప్పుడు అత్యున్నతమైన వృత్తి ప్రమాణాలు పాటించడం, అనవసరంగా రచ్చకెక్కకుండా ఉండటం, ప్రతి చిన్న విషయాన్ని మీడియా ముందుకు పరిగెత్తకుండా సంయమనం పాటించడం.. లాంటి నియమాలు పాటించాలని జైట్లీ సూచించారు. నైతిక విలువలు, సమగ్రత, వృత్తిపరమైన ప్రమాణాలను పాటించడంపైనే ఒక ఏజెన్సీ విశ్వసనీయత ఆధారపడి ఉంటుందని తెలిపారు. 

వ్యవసాయోత్పత్తికి కేంద్ర విధానాల ఊతం
కాగా వ్యవసాయ రంగంలో సంక్షోభం తలెత్తడానికి కాంగ్రెస్‌ గత ప్రభుత్వ పాలనే కారణమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అభిప్రాయపడ్డారు. తమ ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్న విధానాలతో వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని ఆయన చెప్పారు. ఇందుకోసం కేంద్రం భారీగా నిధులు వెచ్చిస్తోందని తన బ్లాగ్‌లో పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు