ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుకు ప్రముఖ నేతలు

24 Dec, 2018 05:01 IST|Sakshi

జనవరి 21–25 మధ్య దావోస్‌లో వార్షిక సమావేశాలు

అరుణ్‌ జైట్లీ, పలు రాష్ట్రాల సీఎంలు, కంపెనీల సీఈవోలకూ చోటు

న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సు వార్షిక సమావేశాలు వచ్చే నెల 21 నుంచి 25వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ పట్టణంలో జరగనున్నాయి.  మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల, ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్‌ కిమ్‌ సహా ఆరుగురు సంయుక్తంగా అధ్యక్షత వహిచనున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సైతం పాల్గొనవచ్చని అంచనా వేస్తున్నారు. వివిధ దేశాల ప్రభుత్వాధిపతులు, రాజకీయ నేతలు, వ్యాపారులు, పౌర సమాజం ప్రముఖులు కలసి 3,000 మంది వరకు ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుకు హాజరుకానున్నారు. ‘ప్రపంచీకరణ 4.0: నాలుగో పారిశ్రామిక విప్లవం దశలో ప్రపంచ స్వరూపం’ ఈ కార్యక్రమం ప్రధాన అంశంగా ఉంటుంది. వాతావరణం మార్పులు, జీవ వైవిధ్యం, ఆటోమేషన్‌ కారణంగా ఉద్యోగాల నష్టం అంశాలను పరిష్కరించాల్సి ఉందని ప్రపంచ ఆర్థిక ఫోరం వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ క్లౌస్‌ ష్వాబ్‌ పేర్కొన్నారు.

కేటీఆర్, లోకేశ్‌ సైతం...: భారత్‌ నుంచి పాల్గొనే వారిలో అరుణ్‌ జైట్లీతోపాటు కేంద్ర మంత్రులు సురేష్‌ ప్రభు, ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్రాల ముఖ్యమంత్రులు కమల్‌నాథ్, చంద్రబాబునాయుడు, దేవేంద్ర ఫడ్నవిస్‌ ఉన్నారు. చంద్రబాబు కుమారుడు మంత్రి లోకేష్, తెలంగాణ సీఎం కేసీఆర్‌ కుమారుడు, కేటీఆర్‌ సైతం హాజరు కానున్నారు. వ్యాపార ప్రముఖులు అజీమ్‌ ప్రేమ్‌జీ, ముకేశ్‌ అంబానీ దంపతులు, ఉదయ్‌ కోటక్, గౌతం అదానీ, లక్ష్మీ మిట్టల్, నందన్‌ నీలేకని, ఆనంద్‌ మహీంద్రా, అజయ్‌ పిరమల్‌ కూడా పాలు పంచుకోనున్నారు.

మరిన్ని వార్తలు