గంటలో రూ.1 కోటి రుణం.. 

27 Sep, 2018 00:52 IST|Sakshi

చిన్న సంస్థల కోసం క్రెడిట్‌ పోర్టల్‌   ప్రారంభించిన కేంద్ర  ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ 

న్యూఢిల్లీ: లఘు, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్‌ఎంఈ) రుణ అవసరాలు తీర్చే దిశగా కేంద్రం ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించింది.www.psbloansin59minutes.com  పేరిట ఏర్పాటు చేసిన ఈ పోర్టల్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఆవిష్కరించారు. ఈ పోర్టల్‌ ద్వారా ఎంఎస్‌ఎంఈలు స్మాల్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (సిడ్బి)తో పాటు అయిదు ప్రభుత్వ రంగ బ్యాంకులకు  రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.  రూ. 1 కోటి దాకా రుణాలకు 59 నిమిషాల్లోనే సూత్రప్రాయ ఆమోదం పొందవచ్చు. దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత 7–8 పనిదినాల్లోగా రుణం అందుకోవచ్చు. ‘రుణాల ప్రాసెసింగ్‌కి సంబంధించి ఈ పోర్టల్‌ కొత్త ప్రమాణాలు నెలకొల్పుతుంది. 20–25 రోజుల వ్యవధి 59 నిమిషాలకే తగ్గుతుంది‘ అని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.  

పోర్టల్‌ ప్రత్యేకతలివీ.. 
ఈ పోర్టల్‌ ద్వారా సిడ్బితో పాటు ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, విజయా బ్యాంక్, ఇండియన్‌ బ్యాంక్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రత్యేకంగా బ్యాంకు శాఖను సందర్శించాల్సిన అవసరం లేదు. రుణ మంజూరు, వితరణ దాకా అంతా మనుషుల ప్రమేయం లేకుండా ఆటోమేటిక్‌గానే ఉంటుంది. దరఖాస్తుదారు ఐటీ రిటర్న్స్, జీఎస్‌టీ గణాంకాలు, బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ మొదలైన వాటన్నింటినీ అత్యాధునిక అల్గోరిథమ్స్‌ ఉపయోగించే పోర్టలే విశ్లేషించుకుంటుంది. ఎంఎస్‌ఎంఈలు ఎలాంటి పూచీకత్తు లేకుండా దాదాపు రూ. 2 కోట్ల దాకా రుణం పొందవచ్చు. 

►రుణం కోసం దరఖాస్తు చేసుకునేందుకు జీఎస్‌టీ ఐడెంటిఫికేషన్‌ నంబరు, జీఎస్‌టీ యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ అవసరం. 
► ఇన్‌కం ట్యాక్స్‌ ఈ ఫైలింగ్‌ పాస్‌వర్డ్, సంస్థ ఏర్పాటు తేదీ వివరాలు లేదా మూడేళ్ల ఐటీ రిటర్నులు ఎక్స్‌ఎంఎల్‌ ఫార్మాట్‌లో ఉండాలి. 
► కరెంటు అకౌంటు వివరాలు, లేదా 6 నెలల బ్యాం క్‌ స్టేట్‌మెంట్‌ పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో ఉండాలి. 
►డైరెక్టరు/పార్ట్‌నరు/ప్రొప్రైటరు కేవైసీ వివరాలు 
►సూత్రప్రాయ ఆమోదం లభించాకా రూ. 1,000 (జీఎస్‌టీ అదనం) కన్వీనియన్స్‌ ఫీజు కట్టాలి.   

>
మరిన్ని వార్తలు