‘పారదర్శకత..అక్కడ పనికిరాదు’

11 Oct, 2017 15:06 IST|Sakshi

వాషింగ్టన్‌: నోట్ల రద్దుపై అత్యంత గోప్యతను పాటించడాన్ని ఆర్థిక మం‍త్రి అరుణ్‌ జైట్లీ సమర్ధించారు. ఈ అంశంలో పారదర్శకత లేకుండా, ముందస్తు సమాచారమిస్తే నోట్ల రద్దు అక్రమాలకు నిలయమయ్యేదని చెప్పారు. ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంక్‌ల వార్షిక సదస్సుల్లో పాల్గొనేందుకు అమెరికాలో పర్యటిస్తున్న జైట్లీ నోట్ల రద్దు, జీఎస్‌టీ వంటి నిర్ణయాలు భారత ఆర్థిక వ్యవస్థను పటిష్ట స్థితిలో నిలిపేలా సాగుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న వ్యవస్థాగత మార్పులతో రానున్న రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తి ప్రక్షాళన కావడంతో పాటు సుధృడ ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు బాటలు పడతాయని చెప్పారు.

నోట్ల రద్దుపై ముందస్తు సమాచారం ఇస్తే ప్రజలు తమ చేతుల్లో ఉన్న డబ్బుతో బంగారం, డైమండ్‌, భూములు కొనడంతో పాటు పలు నగదు లావాదేవీలకు పాల్పడేవారని ప్రతిష్టాత్మక కొలంబియా యూనివర్సిటీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ జైట్లీ చెప్పుకొచ్చారు. ‘పారదర్శకత వినడానికి ఇది మంచి పదం..కానీ ఈ విషయంలో పారదర్శకత పాటించినట్టయితే అది తీవ్ర తప్పిదాలకు దారితీసేది’ అని వ్యాఖ్యానించారు.నోట్ల రద్దు అనంతరం ప్రజల్లో చిన్నపాటి అలజడి కూడా చోటుచేసుకోలేదని, ఇదే ఈ నిర్ణయం విజయవంతమైందనడానికి సంకేతమని జైట్లీ తెలిపారు. నోట్ల రద్దుతో ప్రజలకు తీవ్ర అసౌకర్యం ఏర్పడినా దేశ ప్రయోజనాల కోసం దీన్ని స్వాగతించారని చెప్పారు. నోట్ల రద్దు ఫలితంగా డిజిటల్‌ లావాదేవీలు రెట్టింపయ్యాయని, పెద్దసంఖ్యలో ప్రజలు పన్ను పరిథిలోకి వచ్చారన్నారు.

మరిన్ని వార్తలు