ధరల కట్టడికి కట్టుబడి ఉన్నాం

10 Jun, 2014 01:16 IST|Sakshi
ధరల కట్టడికి కట్టుబడి ఉన్నాం

అధిక ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల విషవలయాన్ని ఛేదిస్తాం

  • దేశ వృద్ధికి తోడ్పాటు అందించండి
  • రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో ప్రి-బడ్జెట్ భేటీలో అరుణ్ జైట్లీ

 న్యూఢిల్లీ: అధిక ధరలు, అధిక వడ్డీ రేట్ల విషవలయాన్ని ఛేదించేందుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. బ్లాక్ మార్కెటింగ్‌ని, అక్రమంగా నిల్వలు ఉంచడాన్ని నిరోధించేందుకు ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, అలాగే కమోడిటీ చట్టాలను కూడా పునఃసమీక్షించాల్సి ఉందని చెప్పారు. రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సోమవారం జరిగిన ప్రీ-బడ్జెట్ సమావేశంలో జైట్లీ ఈ విషయాలు తెలిపారు. అధిక ద్రవ్యోల్బణం సుదీర్ఘకాలం కొనసాగడం వల్ల సామాన్యుల ఆహార, పౌష్టికాహార భద్రతకు నష్టం వాటిల్లుతోందని ఆయన పేర్కొన్నారు.
 
 ఒకవైపు వృద్ధి మందగించడం, మరోవైపు అధిక ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు .. దేశ ఆర్థిక వ్యవస్థకు పెనుసవాళ్లుగా మారాయన్నారు.    కొన్ని రాష్ట్రాలు.. దేశాన్ని మించి వృద్ధి సాధిస్తున్న నేపథ్యంలో యావత్‌దేశాన్నీ మరింత వృద్ధి సాధించే దిశగా నడిపించాల్సిన అవసరం ఉందని జైట్లీ చెప్పారు. ఆర్థిక వృద్ధి సాధనలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడకూడదనే ప్రజలు కూడా ఎన్నికల్లో స్పష్టమైన తీర్పునిచ్చారన్నారు.
 
 వృద్ధిలో సమాన భాగస్వాములు కావాలి..
 ధరల్లో తాత్కాలిక హెచ్చుతగ్గుల సమస్యను పరిష్కరించే ప్రయత్నాల్లో రాష్ట్రాలు కూడా తోడ్పాటు అందించాలని జైట్లీ కోరారు. సరఫరాపరమైన ఆటంకాలను తొలగించే వ్యవస్థను ఏర్పాటు చేయడం, నిత్యావసరాల చట్టాన్ని పునఃసమీక్షించడంతో పాటు బ్లాక్‌మార్కెటింగ్‌పై కొరడా ఝుళిపించేందుకు ప్రత్యేక న్యాయస్థానాలు నెలకొల్పడాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ధరల సమాచారాన్ని రియల్ టైమ్‌లో ఇటు రైతులకు, అటు కొనుగోలుదారులకు చేరవేయగలిగే అవకాశాలను పరిశీలించాల్సి ఉందన్నారు. వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) విధానం వృద్ధి సాధనకు దోహదపడగలదని, త్వరలో దీనికి అడ్డంకులను తొలగించి అమల్లోకి తేగలమని జైట్లీ ఆశాభావం వ్యక్తం చేశారు.
 
 టీమిండియా అంటే కేవలం ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఒక్కటే కాదని, రాష్ట్రాలు కూడా వృద్ధి సాధనలో సమాన భాగస్వాములుగా ఉండాలన్నదే తమ విధానమని జైట్లీ చెప్పారు. ఈ దిశగా రాష్ట్రాలకు కావాల్సిన సహాయ, సహకారాలు పూర్తిగా అందిస్తామన్నారు. రాష్ట్రాలతో సమావేశంలో చర్చించిన అంశాలు, సూచనలు బడ్జెట్ రూపకల్పనలో గణనీయంగా తోడ్పడతాయని ఆయన తెలిపారు. మౌలిక సదుపాయాలపై పెట్టుబడులను భారీగా పెంచడం ద్వారా అధిక వృద్ధి సాధించేందుకు ఆస్కారం ఉంటుం దన్నారు. దీని వల్ల సిమెంటు, ఉక్కు, విద్యుత్ తదితర రంగాలు కూడా మందగమనం నుంచి బయటపడగలవని, భారీగా ఉపాధి అవకాశాలు కూడా లభించగలవని జైట్లీ పేర్కొన్నారు.
 
 ప్రజా పంపిణీ వ్యవస్థ పటిష్టం చేయాలి..
 ధరల పెరుగుదల నుంచి పేదలకు ఉపశమనం కలిగించాలంటే ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని, అలాగే జాతీయ ఆహార భద్రత చట్టాన్ని సమర్థంగా అమలు చేయాల్సి ఉందని జైట్లీ చెప్పారు. కేంద్ర సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి రాష్ట్రాలకు మరింత స్వయం ప్రతిపత్తి ఇవ్వడం కోసం రాష్ట్రాల ప్రభుత్వాల ద్వారా నిధులను మళ్లించాలని యోచిస్తున్నట్లు ఆయన వివరించారు.
 
 జీఎస్‌టీ పై మెజారిటీ రాష్ట్రాల సుముఖత..
 స్వల్ప అభ్యంతరాలు మినహా చాలా మటుకు రాష్ట్రాలు జీఎస్‌టీ అమలుపై సుముఖత వ్యక్తం చేశాయి. అయితే, తమ ఆర్థిక స్వయం ప్రతిపత్తికి రక్షణ కల్పించాలని, దశలవారీగా సెంట్రల్ సేల్స్ ట్యాక్స్(సీఎస్‌టీ) ఉపసంహరణ వల్ల వాటిల్లే ఆదాయ నష్టాన్ని భర్తీ చేయాలని కేంద్రాన్ని కోరాయి. ప్రస్తుత జీఎస్‌టీ విధానంపై తమిళనాడు అభ్యంతరంచెప్పగా, పెట్రోలియం ఉత్పత్తులను దీన్నుంచి మినహాయించాలని అసోం సూచించింది.

మరిన్ని వార్తలు