ప్రపంచ వృద్ధికి భారత్ దన్ను..

29 Mar, 2016 00:16 IST|Sakshi
ప్రపంచ వృద్ధికి భారత్ దన్ను..

అంచనాలను నెరవేరుస్తాం...
స్థిరమైన సంస్కరణలు, విధానాలతో ముందుకెళ్తున్నాం...
బ్లూమ్‌బర్గ్ ఆర్థిక సదస్సులో ప్రధాని మోదీ వ్యాఖ్యలు...

న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారత్ వెలుగురేఖగా నిలుస్తుందన్న అందరి అంచనాలను నెరవేరేలా చేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సుస్థిర విధానాలు, పాలనాపరమైన సంస్కరణలతో వృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని చెప్పారు. బ్లూమ్‌బర్గ్ ఇండియా ఎకనామిక్ ఫోరం-2016 కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ అంశాలను ప్రస్తావించారు. ‘భారత్ ఇప్పుడు ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న, ప్రధానమైన ఆర్థిక వ్యవస్థ. ఈ విషయంలో ఎవరికీ అనుమానాలు అక్కర్లేదు. అత్యంత తక్కువ స్థాయిలో ద్రవ్య, కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్)ను కొనసాగిస్తున్నాం.

ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేశాం. దీన్ని కేవలం అదృష్టంగా భావించకూడదు. మేం అమలు చేస్తున్న సరైన విధానాల ఫలితమే ఇది. అందుకే ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ.. భారత్ మాత్రం ఆర్థిక వృద్ధి విషయంలో మంచి పురోగతిని సాధిస్తోంది. అయితే, ఈ ప్రగతిని చూసి కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే, ఎలాగైనా తక్కువచేసి చూపాలని ఆరాటపడుతున్నారు’ అని మోదీ పేర్కొన్నారు. దేశంలో మరింత మందికి ఉపాధి, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా తమ ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని ప్రధాని వివరించారు. కార్పొరేట్ రుణ ఎగవేతదారుల(డిఫాల్టర్లు) నుంచి బకాయిలను వసూలు చేయడానికి ప్రభుత్వం, ఆర్‌బీఐ కఠిన చర్యలు తీసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే...

 రుణ వృద్ధి జోరందుకుంది...
దేశంలో రుణ వృద్ధి గతేడాది సెప్టెంబర్ తర్వాత నుంచి జోరందుకుంది. కార్పొరేట్ రంగానికి నిధుల లభ్యత కూడా పెరిగింది. ప్రస్తుత ఆర్థిక ఆర్థిక సంవత్సరం(2015-16) మొదటి మూడు త్రైమాసికాల్లో ఈక్విటీ, రుణాల ద్వారా నిధుల సమీకరణ 30% వృద్ధి చెందింది. అంతేకాదు, కంపెనీల క్రెడిట్ రేటింగ్‌లో కోతలకు కూడా అడ్డుకట్టపడింది. 2015-16 ప్రథమార్ధంలో రెండు కంపెనీల రేటింగ్స్ అప్‌గ్రేడ్ అయ్యాయి కూడా. మరోపక్క, దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) భారీగా పెరుగుతున్నాయి. మూడో త్రైమాసికంలో ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలో నికర ఎఫ్‌డీఐలు నమోదయ్యాయి.

ప్రధానంగా గ్రామీణ భారత్‌తో ఎక్కువగా ముడిపడిఉన్న ఎరువులు, చక్కెర, వ్యవసాయ యంత్రాల వంటి రంగాల్లోకి ఎఫ్‌డీఐల జోరు పెరిగింది. నిర్మాణ రంగంలో విదేశీ పెట్టుబడులు 316% వృద్ధి చెందగా.. సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ రంగాల్లో దాదాపు నాలుగు రెట్ల వృద్ధి నమోదైంది. వ్యవసాయ రంగంపై మరింతగా దృష్టిపెడుతున్నాం. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. ప్రజల మద్దతుతో ఇప్పటివరకూ మా ప్రభుత్వం సాధించిన పురోగతిని చూస్తే.. భారత్‌ను మరింత ఉన్నతంగా మార్చగలమన్న నమ్మకం కలుగుతోంది.

ఈ విజయాన్ని క్రూడ్ పతనంతో ముడిపెట్టొద్దు...
భారత్ సాధిస్తున్న ఆర్థిక ప్రగతికి కేవలం ముడిచమురు ధరల పతనం ఒక్కటే కారణం కాదు. ఎందుకంటే చాలా వర్ధమాన దేశాలు క్రూడ్ దిగుమతులపై ఆధారపడుతున్నాయి. మరి వాటి ఆర్థిక వ్యవస్థలు భారత్ మాదిరిగా ఎందుకు పుంజుకోవడం లేదు. 2008-09 మధ్య కూడా క్రూడ్ ధర ఇప్పటికంటే వేగంగా పడిపోయింది. అయినా అప్పుడు ద్రవ్యలోటు, క్యాడ్  చాలా అధికంగానే ఉన్నాయి. మరి ఇప్పుడు వీటిని పూర్తిగా నియంత్రణలో ఉంచగలిగాం. గడిచిన రెండేళ్లుగా ద్రవ్యలోటు కట్టడి లక్ష్యాలను అందుకుంటున్నాం. మేం చేపడుతున్న విధానాలు, సంస్కరణలే దీనికంతటికీ కారణం. అంతేకాదు... వరుసగా రెండేళ్లపాటు కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ, భారత్‌లో ఆహారధాన్యాల ఉత్పత్తి పెరిగింది. ద్రవ్యోల్బణం కూడా భారీగా దిగొచ్చింది.

మరిన్ని వార్తలు