సగానికి తగ్గిన అశోక్‌ లేలాండ్‌ లాభం

1 Aug, 2019 13:03 IST|Sakshi

క్యూ1లో రూ. 275 కోట్లు

రూ.600 కోట్లు సమీకరణ !

చెన్నై: హిందుజా గ్రూప్‌ ప్రధాన కంపెనీ అశోక్‌ లేలాండ్‌ ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ క్వార్టర్‌లో రూ.275 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.467 కోట్ల నికర లాభం వచ్చిందని అశోక్‌ లేలాండ్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.7,194 కోట్ల నుంచి రూ.6,612 కోట్లకు తగ్గిందని కంపెనీ చైర్మన్‌ ధీరజ్‌ జి. హిందుజా తెలిపారు.  ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, గత ఆర్థిక సంవత్సరంలో రూ.33,325 కోట్ల ఆదాయం, రూ.2,195 కోట్ల నికర లాభం సాధించామ న్నారు. 

4 శాతం పెరిగిన మార్కెట్‌ వాటా..
వాహన పరిశ్రమలో అమ్మకాలు 17 శాతం తగ్గగా, తమ కంపెనీ మార్కెట్‌ వాటా 4 శాతం పెరిగిందని ధీరజ్‌ వెల్లడించారు. తేలిక రకం వాణిజ్య వాహనాల విక్రయాలు 12 శాతం పెరిగాయని వివరించారు. భారత్‌ స్టేజ్‌ సిక్స్‌ వాహనాలను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. ఎన్‌సీడీలు, బాండ్ల జారీ ద్వారా రూ.600 కోట్లు సమీకరించనున్నామని చెప్పారు.

మరిన్ని వార్తలు