అశోక్‌ లేలాండ్‌ ఆదాయం 25% అప్‌

14 Nov, 2018 02:16 IST|Sakshi

న్యూఢిల్లీ: హిందుజా గ్రూప్‌నకు చెందిన ప్రధాన కంపెనీ అశోక్‌ లేలాండ్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 37 శాతం ఎగసింది. గత క్యూ2లో రూ.334 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.460 కోట్లకు పెరిగిందని అశోక్‌ లేలాండ్‌ తెలిపింది.

ఆదాయం రూ.6,076 కోట్ల నుంచి 25 శాతం వృద్ధితో రూ.7,608 కోట్లకు పెరిగిందని కంపెనీ సీఈఓ, ఎండీ వినోద్‌ కె. దాసరి వెల్లడించారు. తీవ్రమైన పోటీ, అనేక సవాళ్లున్నప్పటికీ, మంచి ఫలితాలు సాధించామని పేర్కొన్నారు. ఉత్పత్తి వ్యయాలు పెరుగుతుండటం కొనసాగుతున్నప్పటికీ, పటిష్టమైన వ్యయ నియంత్రణ విధానాలతో ఆ ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నామని కంపెనీ సీఏఎఫ్‌ఓ గోపాల్‌ మహదేవన్‌ పేర్కొన్నారు.   

సీఈఓ పదవికి వినోద్‌ రాజీనామా
14 ఏళ్లుగా అశోక్‌ లేలాండ్‌ కంపెనీలో వివిధ హోదాల్లో విజయవంతంగా పనిచేసిన వినోద్‌ కె. దాసరి... సీఈఓ, ఎమ్‌డీ పదవులకు  రాజీనామా చేసినట్లు కంపెనీ తెలియజేసింది. ఆయన రాజీనామా వచ్చే ఏడాది మార్చి 31 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. వ్యక్తిగత కారణాలతో పాటు, కొత్త విషయాలపై తనకున్న ఆసక్తిని మెరుగుపరచుకోవటానికి ఆయన రాజీనామా చేస్తున్నారని, ఆయన నిర్ణయాన్ని గౌరవించాలని డైరెక్టర్ల బోర్డ్‌ నిర్ణయించిందని కంపెనీ వివరించింది.

తక్షణం కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా ధీరజ్‌ హిందుజా వ్యవహరిస్తారని పేర్కొంది. కొత్త సీఈఓ, ఎమ్‌డీ నియామకం కోసం నామినేషన్స్, రెమ్యూనరేషన్‌ కమిటీ త్వరలోనే కసరత్తు ఆరంభించనున్నదని తెలిపింది. ఫలితాలు, వినోద్‌ దాసరి రాజీనామా మార్కెట్లు ముగిశాక వెలువడ్డాయి. మంగళవారం బీఎస్‌ఈలో అశోక్‌ లేలాండ్‌ షేర్‌ 0.8% లాభంతో రూ.119 వద్ద ముగిసింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు