అశోక్‌ లేలాండ్‌ లాభం 21% డౌన్‌ 

15 Feb, 2019 00:55 IST|Sakshi

ఆదాయం కూడా 12 శాతం క్షీణత

2020 నుంచి పూర్తి స్థాయి ఎల్‌సీవీలు

న్యూఢిల్లీ: హిందుజా గ్రూప్‌నకు చెందిన ప్రధాన కంపెనీ అశోక్‌ లేలాండ్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 21 శాతం తగ్గింది. గత క్యూ3లో రూ.485 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.381 కోట్లకు తగ్గిందని అశోక్‌ లేలాండ్‌ తెలిపింది. ఇతర ఆదాయం తక్కువగా ఉండటం, అమ్మకాలు కూడా తగ్గడంతో నికర లాభం తగ్గింది. మొత్తం ఆదాయం రూ.7,191 కోట్ల నుంచి 12 శాతం క్షీణించి రూ.6,325 కోట్లకు తగ్గిందని పేర్కొంది. అమ్మకాలు 6 శాతం తగ్గగా, ఇతర ఆదాయం 43 శాతం తగ్గి రూ.80 కోట్లకు చేరిందని వివరించింది. ఎబిటా 23 శాతం తగ్గి రూ.650 కోట్లకు చేరగా, ఎబిటా మార్జిన్‌ 1.4 శాతం తగ్గి 10.3 శాతంగా ఉందని కంపెనీ పేర్కొంది. పన్ను వ్యయాలు 56 శాతం తగ్గి రూ.106 కోట్లకు తగ్గాయని తెలిపింది.  

పూర్తి రేంజ్‌ ఎల్‌సీవీలు... 
ధరల ఒత్తిడి, ఉత్పత్తి వ్యయాలు పెరగడం వంటి సమస్యలున్నప్పటికీ, ఈ క్యూ3లో మంచి ఫలితాలు సాధించామని కంపెనీ సీఎఫ్‌ఓ గోపాల్‌ మహదేవన్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ, రెండంకెల ఎబిటా మార్జిన్‌ సాధించగలిగామన్నారు. తేలిక రకం వాణిజ్య వాహనాల (ఎల్‌సీవీ) వ్యాపారాన్ని అశోక్‌ లేలాండ్‌లో విలీనం చేశామని కంపెనీ ఎమ్‌డీ వినోద్‌ కె దాసరి చెప్పారు. 2020 నుంచి పూర్తి రేంజ్‌ ఎల్‌సీవీలను ఆఫర్‌ చేస్తామని తెలిపారు. ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడంతో  బీఎస్‌ఈలో అశోక్‌ లేలాండ్‌ షేర్‌ 7 శాతం లాభంతో రూ.84.50 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్‌  4 శాతం నష్టంతో తాజా ఏడాది కనిష్ట స్థాయి, రూ.77.75ను తాకింది. 

మరిన్ని వార్తలు