అశోక్ లేలాండ్ లాభం 67 శాతం డౌన్

26 May, 2016 02:43 IST|Sakshi
అశోక్ లేలాండ్ లాభం 67 శాతం డౌన్

* క్యూ4లో రూ. 77 కోట్లు
* ఒక్కో షేర్‌కు 95 పైసల డివిడెండ్
న్యూఢిల్లీ: హిందుజా గ్రూప్ ప్రధాన కంపెనీ అశోక్ లేలాండ్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి 67 శాతం క్షీణించింది. 2014-15 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.230 కోట్ల నికర లాభం రాగా, గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.77 కోట్ల నికర నష్టాలు వచ్చాయని అశోక్ లేలాండ్ తెలిపింది. ఇన్వెస్ట్‌మెంట్స్ విలువలో తరుగుదల కారణంగా ఈ స్థాయిలో నష్టాలొచ్చినట్లు అశోక్ లేలాండ్ ఎండీ, వినోద్ కె. దాసరి చెప్పారు.

విదేశాల్లోని అనుబంధ సంస్థలు, జాయింట్ వెంచర్లలో పెట్టిన పెట్టుబడుల తరుగుదలకు కూడా కలుపుకొని మొత్తం రూ.389 కోట్ల అసాధరణమైన కేటాయింపులు జరిపినట్లు చెప్పారు. నికర అమ్మకాలు రూ.4,436 కోట్ల నుంచి 33 శాతం వృద్ధితో రూ.5,893 కోట్లకు పెరిగాయి. రూ.1 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.0.95 డివిడెండ్‌ను ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు.  ఈక్విటీ షేర్లు, సెక్యూర్డ్/అన్‌సెక్యూర్డ్ రిడీమబుల్ నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల జారీ ద్వారా రూ.700 కోట్ల నిధుల సమీకరణకు డెరైక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని దాసరి వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు