వచ్చే ఏడాది అశోక్ లేలాండ్ ఎలక్ట్రిక్ బస్సులు

16 Oct, 2014 01:21 IST|Sakshi
వచ్చే ఏడాది అశోక్ లేలాండ్ ఎలక్ట్రిక్ బస్సులు

* ఒక్క చార్జింగ్‌తో 200 కి.మీ.ప్రయాణం
* బస్సు ఖరీదు రూ. 2-3 కోట్లు

చెన్నై: అశోక్ లేలాండ్ కంపెనీ వచ్చే ఏడాది మొదట్లో ఆప్టేర్ ఎలక్ట్రిక్ బస్సులను భారత్‌లో ప్రవేశప్టెట్టనుంది. ఇంగ్లండ్‌లో ఈ బస్సులు విజయవంతంగా నడుస్తుండటంతో భారత్‌లో కూడా వీటిని అందించనున్నామని అశోక్ లేలాండ్ ఎండీ వినోద్ కె. దాసరి చెప్పారు.

ఇంజిన్ ఉండని ఎలక్ట్రిక్ బస్సులు
ఎలక్ట్రిక్, హైబ్రిడ్ బస్సులకు సంబంధించి అంతర్జాతీయ అగ్రగామి సంస్థల్లో అప్‌టరే ఒకటని దాసరి వివరించారు. వచ్చే ఏడాది నుంచి వీటిని భారత్‌లో తయారు చేయడం ప్రారంభిస్తామని, ఢిల్లీల్లో వచ్చే ఏడాది జనవరి 22న జరిగే బస్ ఎక్స్‌పోలో వీటిని ప్రదర్శిస్తామని పేర్కొన్నారు. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 200 కిమీ. నడుస్తాయని, ఒక్కో బస్సు ఖరీదు రూ.2-3 కోట్లు ఉంటుందని తెలిపారు. అశోక్ లేలాండ్ బ్యాడ్జ్ కిందనే ఈ ఎలక్ట్రిక్ బస్సులను విక్రయిస్తామని పేర్కొన్నారు. ప్రారంభంలో ఆప్‌టరేలో సోలో, వెర్సా మెడళ్లను భారత్‌లో తయారు చేస్తామని చెప్పారు.  రాష్ట్ర ప్రభుత్వాల కోసమే వీటిని తయారు చేస్తామని చెప్పారు. ఈ బస్సుల్లో ఎలక్ట్రిక్ మోటార్లు, బ్యాటరీలు ఉంటాయని, ఇంజిన్లు ఉండవని, హైబ్రిడ్ వేరియంట్‌లో చిన్న డీజిల్ ఇంజిన్ ఉంటుందని తెలిపారు.
 
మార్కెట్ చిన్నదే...
అయితే భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ చిన్నదని దాసరి వివరించారు. 20 ఏళ్ల క్రితమే సీఎన్‌జీ బస్సులను మార్కెట్లోకి తెచ్చామని, అయితే వాటికి ఇప్పటికీ మార్కెట్ లేదన్నారు.  పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ బస్సులపై ఆసక్తి చూపుతున్నాయని ఆయన వెల్లడించారు. ఎలక్ట్రిక్  బస్సులను తయారు చేసే ఇంగ్లాండ్‌కు చెందిన ఆప్టేర్ పీఎల్‌సీ కంపెనీలో హిందూజా గ్రూప్‌నకు మెజారిటీ వాటా ఉంది.

మరిన్ని వార్తలు