కార్పొరేట్ల కబడ్డీ కబడ్డీ..!

24 May, 2014 01:22 IST|Sakshi
కార్పొరేట్ల కబడ్డీ కబడ్డీ..!

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్, హాకీ లీగ్, బ్యాడ్మింటన్ లీగ్ మొదలైన వాటి తర్వాత కార్పొరేట్లు ప్రస్తుతం కబడ్డీపై దృష్టి సారించారు. ఐపీఎల్ క్రికెట్ తరహాలోనే ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్)కి శ్రీకారం చుట్టారు. కిషోర్ బియానీ మొదలుకుని రోనీ స్క్రూవాలా వ్యాపార దిగ్గజాలు దేశవాళీ కబడ్డీని ప్రోత్సహించే ప్రయత్నాల్లో పడ్డారు. ఇటీవలే జరిగిన పీకేఎల్ తొలి విడత వేలంలో కార్పొరేట్లు, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ కూడా పోటీపడ్డారు. భారీ మొత్తాలు వెచ్చించి జాతీయ స్థాయి ఆటగాళ్లను దక్కించుకున్నారు. వేలంలో మొత్తం  96 మంది ప్లేయర్స్ కోసం ఎనిమిది టీమ్స్ పోటీపడ్డాయి.

ఈ టీమ్‌లలో కోర్ గ్రీన్ గ్రూప్‌నకు చెందిన విశాఖపట్నం జట్టు, ఉదయ్ కోటక్ సారథ్యంలోని పుణే ఫ్రాంచైజీ, కాస్మిక్ గ్లోబల్ మీడియా నేతృత్వంలోని బెంగళూరు, యస్ బ్యాంక్ ఎండీ రాణా కపూర్ కుమార్తె రాధా కపూర్‌కి చెందిన ఢిల్లీ ఫ్రాంచైజీ, రోనీ స్క్రూవాలా సారథ్యంలోని ముంబై జట్టు ఉన్నాయి. అభిషేక్ బచ్చన్‌కి చెందిన జైపూర్ టీమ్, ఫ్యూచర్ గ్రూప్ అధినేత కిషోర్ బియానీకి చెందిన కోల్‌కతా ఫ్రాంచైజీ, వ్యాపారవేత్త రాజేష్ షా టీమ్‌లు కూడా వేలంలో పాల్గొన్నాయి.


 కామెంటేటర్ చారు శర్మ సారథ్యంలోని మషాల్ స్పోర్ట్స్ సంస్థ ఈ కాన్సెప్టునకు రూపకల్పన చేసింది. ఒక్కొక్క టీమ్‌పై గరిష్టంగా రూ. 60 లక్షలు మాత్రమే వ్యయం చేసేందుకు వీలుంటుంది. ప్లేయర్లతో ఫ్రాంచైజీలు రెండేళ్ల కాంట్రాక్టులు కుదుర్చుకుంటాయి. రెండేళ్ల తర్వాత.. ఫ్రాంచైజీలు ఇతరత్రా ప్లేయర్లను కూడా తీసుకోవడానికి వీలుంటుంది. జూలై 26న ప్రారంభమయ్యే లీగ్‌ను స్టార్ ఇండియా స్పోర్ట్స్ నెట్‌వర్క్ ప్రసారం చేయనుంది. ప్రతీ టీమ్ తన సొంత ఊరిలో నాలుగు గేమ్స్ ఆడుతుంది.

 పెట్టుబడి ఏటా 5 కోట్లు..: ఫ్రాంచైజీ ఫీజు, స్పోర్ట్ డెవలప్‌మెంట్ ఇన్వెస్ట్‌మెంట్లు, ఇతరత్రా వ్యయాలు కలిపి ఒక్కో ఫ్రాంచైజీ ఏటా సుమారు రూ. 5 కోట్లు దాకా వెచ్చించాల్సి వస్తుంది. పదేళ్ల పాటు ఫ్రాంచైజీ హక్కుల కోసం కార్పొరేట్లు ఏటా దాదాపు రూ. 1 కోటి నుంచి 1.5 కోట్ల దాకా వెచ్చిస్తున్నారు. టీమ్ స్పాన్సర్‌షిప్, గేట్ ఫీజు, ప్రైజ్ మనీ రూపంలో ఫ్రాంచైజీలు ఆదాయం సమకూర్చుకోవచ్చు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా