ఈ ఏడాది భారత్‌ వృద్ధి 5.1 శాతమే!

12 Dec, 2019 03:26 IST|Sakshi

ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ అంచనా

2020లో 6.5% ఉంటుందని విశ్లేషణ

న్యూఢిల్లీ: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 2019లో 5.1 శాతమే ఉంటుందని ఆసి యా అభివృద్ధి బ్యాంక్‌ (ఏడీబీ) తాజా నివేదికలో పేర్కొంది. ఉపాధి అవకాశాలు నెమ్మదించడం, పంట దిగుబడులు సరిగాలేక గ్రామీణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ బలహీనత, రుణ వృద్ధి మందగమనం వంటి  అంశాలు దీనికి కారణమని ఏడీబీ విశ్లేషించింది. అయితే 2020లో భారత్‌ వృద్ధి 6.5 శాతం ఉంటుందని అంచనావేసింది. ప్రభుత్వ విధానాలు, సంస్కరణలు ఫలితాన్ని ఇచ్చే అవకాశాలు ఉండడం 2020పై తమ అంచనాలకు కారణమని తన 2019 అప్‌డేటెడ్‌ ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ అవుట్‌లుక్‌లో ఏడీబీ పేర్కొంది.
 
రెండవసారి కోత...:
నిజానికి 2019లో 7 శాతం వృద్ధి రేటు ఉంటుందని తొలుత ఏడీబీ అంచనావేసింది. అయితే సెప్టెంబర్‌ మొదట్లో దీనిని 6.5 శాతానికి తగ్గించింది. తాజాగా దీనిని మరింత కుదించి 5.1 శాతానికి చేర్చింది. ఇక 2020 విషయానికి వస్తే, తొలి అంచనా 7.2 శాతం అయితే దీనిని 6.5 శాతానికి తాజాగా తగ్గించింది. 2018లో భారత్‌ వృద్ధిరేటు 6.8 శాతంగా ఏడీబీ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019 ఏప్రిల్‌ నుంచి 2020 మార్చి వరకూ) దేశీయ వృద్ధి రేటును 6.1 శాతం నుంచి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే.

ఐఎఫ్‌ఎస్‌సీల నియంత్రణకు ప్రత్యేక సంస్థ
న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సెంటర్స్‌ (ఐఎఫ్‌ఎస్‌సీ)ల్లో ఆర్థిక లావాదేవీల నియంత్రణ కోసం ఏకీకృత సంస్థ  ఏర్పాటుకు లోక్‌సభ బుధవారం ఆమోదముద్ర వేసింది. దేశీయంగా తొలి ఐఎఫ్‌ఎస్‌సీ గుజరాత్‌లోని గాంధీ నగర్‌లో ఏర్పాటైంది. దీన్ని గుజరాత్‌ ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ టెక్‌–సిటీ (గిఫ్ట్‌)గా వ్యవహరిస్తున్నారు. ఈ నియం త్రణ సంస్థ స్వతంత్రంగా వ్యవహరిస్తుందని, అయితే.. సీవీసీ, కాగ్‌ పరిధిలో ఉంటుందని  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా