వెలుగులో ఐటీ, ఎఫ్‌ఎంసీజీ

13 Mar, 2014 01:14 IST|Sakshi
వెలుగులో ఐటీ, ఎఫ్‌ఎంసీజీ

ఆసియా స్టాక్ మార్కెట్లు పతనమైనా, భారత్ సూచీలు బుధవారం ఎఫ్‌ఎంసీజీ, ఐటీ షేర్ల మద్దతుతో పాజిటివ్‌గా ముగిశాయి. చైనా వృద్ధి రేటు మందగించిన ప్రభావంతో జపాన్, హాంకాంగ్, సింగపూర్, కొరియా తదితర ఆసియా మార్కెట్లు 1-2 శాతం మధ్య పడిపోయాయి. యూరప్ మార్కెట్లు కూడా క్షీణతతో ట్రేడవుతున్నా, బీఎస్‌ఈ సెన్సెక్స్ 30 పాయింట్ల పెరుగుదలతో 21,856 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 5 పాయింట్లు లాభపడి 6,517 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మన మార్కెట్ ముగిసిన తర్వాత వెలువడే పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణ గణాంకాల పట్ల ఆశాభావంతో మార్కెట్ పాజిటివ్‌గా ముగిసిందని బ్రోకింగ్ వర్గాలు తెలిపాయి. తదుపరి వెలువడిన డేటా ప్రకారం మార్కెట్ అంచనాలకు అనుగుణంగా ఫిబ్రవరి నెల ద్రవ్యోల్బణం రేటు 8.1 శాతానికి తగ్గింది. జనవరి నెలలో పారిశ్రామికోత్పత్తి తగ్గొచ్చన్నది మార్కెట్ అంచనా కాగా, ఐఐపీ సూచీ 0.1 శాతం పెరిగింది.
 
 లిస్టింగ్‌లోనే శాంకో నీరసం
 ముంబై: ఎన్‌ఎస్‌ఈ ఎమర్జ్ ప్లాట్‌ఫామ్ ద్వారా లిస్టయిన పీవీసీ పైపుల తయారీ సంస్థ శాంకో ఇండస్ట్రీస్ తొలి రోజు 4% నష్టపోయింది. ఈ చిన్న, మధ్యతరహా సంస్థ(ఎస్‌ఎంఈ) షేరు రూ. 19 వద్ద లిస్టయ్యింది. ఆపై 4.2% క్షీణించి రూ. 17.25 వద్ద ముగిసింది. హిమాచల్ ప్రదేశ్‌లో యూనిట్ కలిగిన శాంకో ఎన్‌ఎస్‌ఈ ఎమర్జ్ ద్వారా లిస్టయిన ఐదో కంపెనీగా నిలిచింది. చిన్న సంస్థలు(ఎస్‌ఎంఈలు) ఐపీవోలను చేపట్టి నిధులు సమీకరించేందుకు వీలుగా ఎన్‌ఎస్‌ఈ ఏర్పాటు చేసిన ప్లాట్‌ఫామ్ ఎమర్జ్‌కాగా, శాంకో గత నెల 24న రూ. 18 ధరలో 24 లక్షల షేర్లను విక్రయించింది. 

మరిన్ని వార్తలు