బెంగళూరులో ‘ఐఫోన్‌’ అసెంబ్లింగ్‌!

31 Mar, 2017 00:26 IST|Sakshi
బెంగళూరులో ‘ఐఫోన్‌’ అసెంబ్లింగ్‌!

నెల రోజుల్లో ప్రారంభించనున్న యాపిల్‌
కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్‌ ఖర్గే  


బెంగళూరు: యాపిల్‌ కంపెనీ నెలరోజుల్లో తన ఐఫోన్లను బెంగళూరు ప్లాంట్‌లో అసెంబ్లింగ్‌ చేయడాన్ని ఆరంభించనుంది. ఈ ప్లాంట్‌లో యాపిల్‌ కంపెనీ హై ఎండ్‌ ఐఫోన్ల అసెంబ్లింగ్‌ను నెలలోపే ప్రారంభిస్తుందన్న విషయాన్ని కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్‌ ఖర్గే ధ్రువీకరించారు. ఐఫోన్ల అసెంబ్లింగ్‌లో యాపిల్‌ కంపెనీకి తైవాన్‌కు చెందిన కాంట్రాక్ట్‌ మాన్యుఫాక్చరింగ్‌ కంపెనీ విస్టర్న్‌ కార్ప్‌ తోడ్పాటునందిస్తుందని తెలిపారు. ఇక్కడే ఐఫోన్లను తయారు చేయడం వల్ల భారత్‌లో ఐఫోన్ల ధరలు దిగివస్తాయని, ఫలితంగా వేగంగా వృద్ధి చెందుతున్న భారత మొబైల్‌ మార్కెట్లో యాపిల్‌ కంపెనీ మార్కెట్‌ వాటా పెరగగలదని వ్యాఖ్యానించారు.

రాయితీలు ఇవ్వాలి...
చైనా, తైవాన్‌లకు గట్టి పోటీనివ్వడానికి యాపిల్‌ కంపెనీకే కాకుండా శామ్‌సంగ్, లెనొవొ తదితర కంపెనీలకు కూడా రాయితీలివ్వాలని ఖర్గే సూచించారు. అన్ని కంపెనీలకు సమాన అవకాశాలు కల్పించేందుకు గాను యాపిల్‌తో సహా పలు కంపెనీలకు నిర్దేశిత గడువు వరకూ కొన్ని సబ్సిడీలను, ప్రోత్సాహకాలను ఇవ్వాలని చెప్పారు.

 స్థానిక మార్కెట్‌ నుంచే విడిభాగాలను సమీకరించుకొని, ఫోన్లను పూర్తిగా ఇక్కడే తయారు చేసుకోవడానికి ప్రతి కంపెనీకి పదేళ్ల గడువును ఇవ్వాలన్నారు. స్టార్టప్‌లు భారత చట్టాల ప్రకారమే పనిచేయాల్సి ఉంటుందని ‘స్టేజిల్లా’ స్టార్టప్‌ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ ఆయన వ్యాఖ్యానించారు. బకాయిలు చెల్లించలేదంటూ చెన్నైకి చెందిన ఒక ప్రకటనల కంపెనీ కేసు దాఖలు చేయడంతో స్టేజిల్లా స్టార్టప్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన యోగేంద్ర వాసుపాల్‌ అరెస్టవడం తెలిసిందే.

మరిన్ని వార్తలు