స్మార్ట్ స్కూటర్ వచ్చేసింది

24 Feb, 2016 12:19 IST|Sakshi
స్మార్ట్ స్కూటర్ వచ్చేసింది

న్యూఢిల్లీ: ఇప్పటివరకు మనం స్మార్ట్ ఫోన్లు చూశాం, స్మార్ట్ వాచీలు చూశాం.. చివరకు స్మార్ట్ కళ్లజోళ్లు కూడా చూశాం. కానీ ఇప్పుడు కొత్తగా ఓ స్మార్ట్ స్కూటర్ మార్కెట్లను ముంచెత్తబోతోంది. లిథియం ఆయాన్ బ్యాటరీ బ్యాకప్‌తో ఏథర్ ఎనర్జీ కంపెనీ రూపొందించిన ఏథర్ ఎస్-340 స్కూటర్ త్వరలోనే వస్తోంది. 2016లో టెక్ సమ్మిట్‌లో దీన్ని ఆవిష్కరించనున్నట్టు ఎథర్ ప్రకటించింది. బెంగళూరుకు చెందిన  ఈ సంస్థ మొదటి వెంచర్ ఇదే కావడం గమనార్హం. దేశంలో తొలి స్మార్ట్ స్కూటర్ తయారుచేయాలన్న తమ కలను నెరవేర్చుకున్నామని ఆనందం వ్యక్తం చేసింది.

మద్రాస్ ఐఐటీ పూర్వ విద్యార్థులు  తరుణ్ మెహతా, స్వప్నిల్ జైన్ ఇద్దరూ పెట్రోల్,  డీజిల్  తప్ప వాహనాలకు వేరే ఇంధనం లేకపోవడంపై మధనపడ్డారు. ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు వచ్చినా, అవి పెద్దగా  క్లిక్ కాకపోవడానికి  కారణాలను, సమస్యలను అధ్యయనం చేశారు.  వాటిని  ఎందుకు పరిష్కరించకూడదని ఆలోచించారు.  ఇందులో భాగంగానే  2013లో ఏథర్ ఎనర్జీ అనే స్టార్టప్ కంపెనీ మొదలుపెట్టారు. దాని ఫలితమే ఈ  ఎలక్ట్రిక్ స్మార్ట్ స్కూటర్ అవిష్కారం. లిథియం ఆయాన్ బ్యాటరీ బ్యాకప్ సహాయంతో ఏథర్ ఎస్-340 స్కూటర్ కు రూపకల్పనలో సక్సెస్ అయ్యారు.

టచ్ స్క్రీన్ డాష్ బోర్డు, రిమోట్ అప్లికేషన్ కంట్రోల్, లైట్  సెన్సింగ్ హెడ్ ల్యాంప్స్ దీని ప్రత్యేకతలు. దీంతోపాటుగా  ప్రస్తుతం మన దేశంలో కార్లలో కూడా అందుబాటులో లేని ఎయిర్ అప్డేట్స్ అందించడం దీని స్పెషాల్టీ. ఛార్జింగ్ కూడా చాలా వేగంగా అవుతుందని, 50 నిమిషాల్లో 80 శాతం చార్జ్ అవుతుందని చెబుతున్నారు. ఒకసారి ఛార్జి చేసుకుంటే.. 72 కిలోమీటర్ల గరిష్ట వేగంతో 60 కిలోమీటర్ల వరకు  దూసుకుపోవచ్చు. అలాగే, స్కూటర్‌ బ్యాటరీతో ఇంకా ఎంత దూరం వెళ్లొచ్చన్న విషయం కూడా తెలుస్తుంది. జీపీఎస్ కూడా ఉండటంతో ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే ఆ మ్యాప్‌ను కూడా స్కూటర్ డాష్ బోర్డు మీదే చూసుకోవచ్చు. అలాగే, వెళ్లే దారిలో మధ్యలో ఎక్కడెక్కడ చార్జింగ్ పాయింట్లు ఉన్నాయో కూడా అందులో చూపిస్తుంది. వెళ్తున్న వేగాన్ని బట్టి.. గమ్యానికి ఎంత సేపట్లో చేరుతారో చెబుతుంది. అన్నట్టు ఈ స్మార్ట్ వెహికల్‌ని ఆన్‌లైన్‌లో మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వాహనాన్ని డోర్ డెలివరీ చేస్తారు. అయితే దీని ధరను మాత్రం ఇంకా ప్రకటించలేదు.

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న తొలి స్మార్ట్ స్కూటర్ ఎస్-340. ఈ స్మార్ట్ స్కూటర్ ఎంతవరకు విజయవంతం అవుతుందన్నది కాలమే నిర్ణయించాలి.

మరిన్ని వార్తలు