‘అట్లాస్‌’ మళ్లీ వస్తుందా..?

6 Jun, 2020 03:28 IST|Sakshi

చివరి ప్లాంట్‌ కూడా మూసివేత

కంపెనీ వద్ద చిల్లిగవ్వలేని పరిస్థితి

మూసివేత తాత్కాలికమే: కంపెనీ సీఈవో

న్యూఢిల్లీ: అట్లాస్‌ సైకిల్స్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. దశాబ్దాలుగా లక్షలాది భారతీయుల కుటుంబాలకు సైకిళ్లను అందించిన ఈ కంపెనీ ఇప్పుడు నిధుల్లేక అల్లాడిపోతోంది. కార్యకలాపాల నిర్వహణకు చిల్లిగవ్వకూడా లేని పరిస్థితి ఏర్పడడంతో దేశ రాజధాని సమీపంలోని సాహిదాబాద్‌లో ఉన్న చివరి ప్లాంట్‌ను కూడా అట్లాస్‌ సైకిల్స్‌ మూసివేసింది. ప్రపంచ సైకిల్‌ దినోత్సవం అయిన జూన్‌ 3నే కంపెనీ ప్లాంట్‌ మూతపడడం యాదృచ్ఛికం. అయితే, ప్లాంట్‌ మూసివేత తాత్కాలికమేనని కంపెనీ సీఈవో ఎన్‌పీ సింగ్‌ రాణా ప్రకటించారు. తాము అనుకున్నట్టుగా కంపెనీ వద్ద మిగులు భూమిని విక్రయించి రూ.50 కోట్లు సమీకరించగలిగితే.. కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. అట్లాస్‌ సైకిల్స్‌ సాహిదాబాద్‌ ప్లాంట్‌లో 431 మంది కార్మికులు పనిచేస్తుండగా.. ఇప్పుడు వారు ఉపాధి కోల్పోయారు.  

నష్టాల వల్లే..: అట్లాస్‌ సైకిల్స్‌ను నష్టాలే ముంచేశాయి. 2014 నుంచి ఈ కంపెనీ వ్యాపార కార్యకలాపాలపై నష్టాలను ఎదుర్కొంటోంది. దీంతో 2014 డిసెంబర్‌లో మలన్‌పూర్‌ ప్లాంట్‌కు కంపెనీ తాళాలు వేసేసింది. ముఖ్యంగా గత రెండేళ్ల కాలంలో నష్టాలు మరింత అధికమయ్యాయి. ఫలితంగా 2018 ఫిబ్రవరిలో హరియాణాలోని సోనిపట్‌ ప్లాంట్‌ను కూడా కంపెనీ మూసేసింది. సోనిపట్‌ ప్లాంట్‌ కంపెనీకి మొదటిది. 1951లో దీన్ని జానకిదాస్‌ కపూర్‌ ప్రారంభించారు. 1965 నాటికి అట్లాస్‌ సైకిల్స్‌ దేశంలోనే అతిపెద్ద సైకిళ్ల తయారీ కంపెనీగా అవతరించింది. విదేశాలకూ కార్యకలాపాలను విస్తరించడం ద్వారా 40 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ప్రపంచంలోనే ప్రముఖ సైకిళ్ల కంపెనీల్లో ఒకటిగా గుర్తింపు సంపాదించుకుంది. 1982లో ఏషియన్‌ గేమ్స్‌కు సైకిళ్లను సరఫరా చేసింది.

తిరిగి వస్తాం..: కంపెనీ సీఈవో రాణా మాత్రం ప్లాంట్‌ మూసివేత తాత్కాలికమేనని స్పష్టం చేశారు. ‘‘ప్లాంట్‌ను మూసివేయలేదు. దీనిపై ఎంతో తప్పుడు సమాచారం నెలకొని ఉంది. ప్లాంట్‌ను తిరిగి ప్రారంభిస్తాం. ఉద్యోగులను కూడా తొలగించలేదు. తాత్కాలికంగా కార్యకలాపాలను నిలిపివేశామంతే. మిగులు భూమి విక్రయానికి అనుమతించాల్సిందిగా ఎన్‌సీఎల్‌టీకి దరఖాస్తు  చేసుకున్నాం. అనుమతి వచ్చిన వెంటనే భూ విక్రయాన్ని చేపట్టి, నిధులు అందిన వెంటనే ప్లాంట్‌ను తిరిగి తెరుస్తాం. కంపెనీ ఉత్పత్తులకు డిమాండ్‌ సమస్య లేదు. 70 ఏళ్ల బ్రాండ్‌ మాది. తిరిగి నిలదొక్కుకుంటాం’’ అని రాణా వివరించారు.   

>
మరిన్ని వార్తలు