కాస్ట్‌లీగా మారబోతున్న ఏటీఎం లావాదేవీలు

2 Jan, 2018 09:51 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సామాన్య ప్రజలపై మరో భారం పడబోతుంది. ఏటీఎం ఆపరేటర్లు, ముఖ్యంగా ప్రైవేట్‌ బ్యాంకులు ఏటీఎం లావాదేవీల ఇంటర్‌-బ్యాంకు ఛార్జీలను పెంచాలని నిర్ణయిస్తున్నాయి. ఓ వైపు డిమానిటైజేషన్‌, మరోవైపు నిర్వహణ వ్యయాలు పెరుగడంతో, ఈ మేరకు నిర్ణయం తీసుకోబోతున్నట్టు పేర్కొన్నాయి. ప్రైవేట్‌, ప్రభుత్వ బ్యాంకులతో నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఇప్పటికే ఈ విషయంపై వేరువేరుగా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో  దీనిపై చర్చించినట్టు తెలిసింది. 

ఇంటర్ బ్యాంక్ ఛార్జీని ఓ బ్యాంకు కస్టమర్‌ వేరే బ్యాంకు ఏటీఎంలను వాడుకున్నందుకు ఆ బ్యాంకుకు విధిస్తారు. దీంతో చిన్న ఏటీఎం నెట్‌వర్క్స్‌ కలిగి ఉన్న బ్యాంకులకు భారంగా మారుతోంది. వ్యయాల భారం పెరిగిపోతుంది. దీంతో బ్యాంకులు వ్యయాల్లో కొంత భాగాన్ని వినియోగదారులకు తరలించాలని ప్లాన్‌ చేస్తున్నాయి. ప్రైవేట్‌ రంగ బ్యాంకులు ఇంటర్‌-బ్యాంకు ఫీజులను పెంచాలని కోరుతుండగా.. కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే తమ ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయని, ఒకవేళ ఇంకా వీటిని పెంచితే, తమ కట్టుబాట్లను కోల్పోతామని పేర్కొంటున్నాయి. ఫీజుల పెంపుకు మరో కారణం, ఏటీఎం కంపెనీలు ప్రస్తుతం ఒత్తిడిలో కొనసాగుతుండటం అని కూడా తెలుస్తోంది. డిమానిటైజేషన్‌ తర్వాత డిజిటల్‌ లావాదేవీలు పెరిగి, ఏటీఎం వాడకం భారీగా తగ్గిపోయింది. దీంతో ఏటీఎం కంపెనీలు ఒత్తిడిలో పడిపోయాయి.

మరిన్ని వార్తలు