ఆకర్షిస్తున్న ఆన్‌లైన్ షాపింగ్

30 May, 2014 03:09 IST|Sakshi
ఆకర్షిస్తున్న ఆన్‌లైన్ షాపింగ్

న్యూఢిల్లీ: ఆకర్షణీయమైన ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్... తదితర అంశాలు ఆనలైన్ షాపింగ్ జోరును పెంచుతున్నాయి. ఈ అంశాల కారణంగా వినియోగదారులు ఆన్‌లైన్ షాపింగ్ పట్ల ఆకర్షితులవుతున్నారని తమ సర్వేలో వెల్లడైందని క్యాష్‌బ్యాక్, కూపన్ల సైట్ క్యాష్‌కరోడాట్‌కామ్ తెలిపింది. ఈ సంస్థ 3,200 మంది ఆన్‌లైన్ షాపర్లపై నిర్వహించిన ది ఆన్‌లైన్ షాపింగ్ ట్రెండ్స్ సర్వేలో వెల్లడైన కొన్ని

ముఖ్యాంశాలు...,
దరలు తక్కువగా ఉండడం, ఇంట్లో ఉంటూనే షాపింగ్ చేసే వీలుండడం.. వంటి అంశాలు కూడా ఆన్‌లైన్ షాపింగ్ జోరును పెంచుతున్నాయి.

క్యాష్‌బ్యాక్ ఆఫర్ తమను ఆకర్షించిందని సర్వేలో పాల్గొన్న 95 శాతం మంది చెప్పారు.

భారీ డిస్కౌంట్ల కారణంగా ఆన్‌లైన్ షాపింగ్‌కు ప్రాధాన్యత ఇస్తున్నామని 27 శాతం మంది పేర్కొన్నారు.

తక్కువ ధరల కారణంగా ఆన్‌లైన్ షాపింగ్‌కు ఆకర్షితులవుతున్నామని 25 శాతం మంది వివరించారు.

సౌకర్యం దృష్టికోణంలో ఇంటర్‌నెట్ ద్వారా షాపింగ్‌కే ప్రాధాన్యత ఇస్తున్నామని 22 శాతం మంది అభిప్రాయపడ్డారు.

ఎంచుకోవడానికి అవకాశాలు అధికంగా ఉంటాయని 16 శాతం మంది, నచ్చకపోతే వస్తువులు తిరిగి ఇచ్చే విధానం బావుండటంతో 10 శాతం మంది ఆన్‌లైన్ షాపింగ్‌కు జై కొడుతున్నారు.  

40 శాతం మంది సగటున ఏడాదికి రూ.10,000 చొప్పున ఆన్‌లైన్ షాపింగ్ చేస్తుండగా, దాదాపు 10 శాతం మంది సగటున ఏడాదికి రూ.50,000 చొప్పున షాపింగ్ చేస్తున్నారు.

వస్తువును ఎంచుకునేందుకు ధర అంశానికి ప్రాధాన్యత  ఇస్తామని 30 శాతం మంది, వస్తువు నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తామని 29 శాతం మంది అభిప్రాయపడ్డారు.

ఇంటర్నెట్ విస్తృతి పెరుగుతుండడంతో భారత ఇ-కామర్స్ మార్కెట్ దూసుకుపోతోంది.

సమీప భవిష్యత్తులో ఆన్‌లైన్ ద్వారా షాపింగ్ చేసే వారి సంఖ్య 20 కోట్లకు సులభంగానే చేరుతుంది.

2013లో భారత ఇ కామర్స్ మార్కెట్ 33 శాతం వృద్ధితో రూ.62,967 కోట్లకు చేరిందని అంచనా.

మరిన్ని వార్తలు