ఆడి సీఈవో స్టాడ్లర్‌ అరెస్టు

19 Jun, 2018 01:33 IST|Sakshi

ఫ్రాంక్‌ఫర్ట్‌: ఫోక్స్‌వ్యాగన్‌ డీజిల్‌ వాహనాల ఉద్గారాల వివాద కేసులో జర్మనీ కార్ల తయారీ దిగ్గజం ఆడి సీఈవో రూపర్ట్‌ స్టాడ్లర్‌ అరెస్టయ్యారు. సాక్ష్యాలను ధ్వంసం చేసే అవకాశం ఉన్నందున ఆయన్ను అరెస్ట్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. స్టాడ్లర్‌ నివాసంలో సోదాలు నిర్వహించిన వారం రోజుల వ్యవధిలోనే అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.

నియంత్రణ సంస్థలను, వినియోగదారులను మోసపుచ్చేలా.. కాలుష్యకారక వాయువుల పరిమాణాన్ని తగ్గించి చూపే సాఫ్ట్‌వేర్‌ను ఫోక్స్‌వ్యాగన్‌ తమ డీజిల్‌ కార్లలో అమర్చిందనే ఆరోపణలున్న సంగతి తెలిసిందే. సాఫ్ట్‌వేర్‌ అమర్చడం నిజమేనంటూ ఆడికి మాతృసంస్థయిన ఫోక్స్‌వ్యాగన్‌ 2015లో అంగీకరించింది. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు ఉద్యోగులు అమెరికాలో జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

ఈ సాఫ్ట్‌వేర్‌ను ఆడి ఇంజినీర్లే అందించి ఉంటారన్న అనుమానాలు ఉన్నాయి. ఈ స్కామ్‌తో ఫోక్స్‌వ్యాగన్‌ దాదాపు 25 బిలియన్‌ యూరోల మేర బైబ్యాక్, నష్టపరిహారాలు, జరిమానాల రూపంలో కట్టుకోవాల్సి వచ్చింది.

మరిన్ని వార్తలు