ఆడి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అరెస్ట్‌

18 Jun, 2018 15:32 IST|Sakshi
ఆడి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ రూపెర్ట్‌ స్టాడ్లర్‌ (ఫైల్‌ ఫోటో)

జర్మనీ లగ్జరీ కారు తయారీదారి ఆడి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ రూపెర్ట్‌ స్టాడ్లర్‌ అరెస్ట్‌ అయ్యారు. డీజిల్‌ ఉద్గారాల స్కాండల్‌ విచారణలో సంబంధం ఉందనే ఆరోపణలతో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆడి సొంతమైన ఫోక్స్‌వాగన్‌ అధికార ప్రతినిధి రూపెర్ట్‌ అరెస్ట్‌ను సోమవారం ధృవీకరించారు. ఆయన్ని కస్టడీలోకి తీసుకుని రిమాండ్‌లోకి తరలించాలని జడ్జి ఆదేశించారు. ఫోక్స్‌వాగన్‌ కర్బన్‌ ఉద్గారాల స్కాండల్‌లో మాల్‌ప్రాక్టిస్‌కు పాల్పడ్డారని రూపెర్ట్‌పై విచారణ కొనసాగుతోంది.

మోసపూరిత సాఫ్ట్‌వేర్‌ను పొందుపరిచిన 2,10,000 డీజిల్‌ ఇంజిన్‌ కార్లను ఆడి 2009 నుంచి అమెరికా, యూరప్‌లలో విక్రయించిందని ఆ కంపెనీపై పెద్ద ఎత్తున్న ఆరోపణలు ఉన్నాయి. గత నెలలోనే తమ 60వేల ఏ6, ఏ7 మోడల్స్‌ను మోసపూరిత సాఫ్ట్‌వేర్‌ను కలిగి ఉన్నట్టు కంపెనీ ఒప్పుకుంది కూడా. ఈ మోసపూరిత ఆరోపణలు, అక్రమ ప్రొడక్ట్‌ ప్రమోషన్లపై ఈ లగ్జరీ కారు తయారీదారిపై దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయి. ఈ మోసంలో ఆడి సీఈవో రూపెర్ట్‌ పాత్ర ఉందని మునిచ్‌ న్యాయవాదులు జూన్‌ 13న ప్రకటించారు. ఆయన ఇంట్లో సోదాలు కూడా జరిపారు. 1994 నుంచి రూపెర్ట్‌ ఫోక్స్‌వాగన్‌-ఆడిలో పనిచేస్తున్నారు. 2007 నుంచి ఆడిలో టాప్‌ మేనేజ్‌మెంట్‌ స్థానంలో ఉన్నారు. 

మరిన్ని వార్తలు