ఆడి క్యూ7 ఎస్‌యూవీలో కొత్త వేరియంట్లు

12 Dec, 2015 02:55 IST|Sakshi
ఆడి క్యూ7 ఎస్‌యూవీలో కొత్త వేరియంట్లు


 న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ ఆడి ప్రీమియం స్పోర్ట్స్ యుటిలిటి మోడల్(ఎస్‌యూవీ) క్యూ7లో రెండు కొత్త వేరియంట్‌లను శుక్రవారం మార్కెట్లోకి తెచ్చింది. ప్రీమియం ప్లస్ వేరియంట్ ధర రూ.72 లక్షలని, క్యూ7 టెక్నాలజీ వేరియంట్ ధర రూ.77.5 లక్షలని(రెండు ధరలూ ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) ఆడి ఇండియా హెడ్ జో కింగ్ తెలిపారు.  ఇంతకు ముందటి మోడల్‌లో పోల్చితే ఈ కొత్త వేరియంట్ 325 కేజీలు తక్కువ బరువుంటుందని, 14.75 లీటర్ల మైలేజీని ఇస్తుందని పేర్కొన్నారు. ఈ కారు మెర్సిడెస్-బెంజ్ జీఎల్, బీఎండబ్ల్యూ ఎక్స్5, వొల్వొ ఎక్స్‌సీ90లకు గట్టిపోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి.

ఈ కారు  సున్నా నుంచి వంద కిలోమీటర్ల వేగాన్ని 6.3 సెకన్లలో పుంజుకుంటుందని, గరిష్ట వేగం గంటకు 250 కిమీ. అని కంపెనీ పేర్కొంది. ఈ కారులో  8.3 అంగుళాల టచ్‌ప్యాడ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెనక కూర్చున్న ప్రయాణికుల కోసం ఆడి ట్యాబ్, 3డీ ఆడియో ఫీచర్ ఉన్న రెండు సౌండ్ సిస్టమ్స్,  8-స్పీడ్ టిప్-ట్రానిక్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వంటి ప్రత్యేకతలున్నాయని కంపెనీ వివరించింది. లగేజ్ స్పేస్ 295 లీటర్లని. మూడో వరుస సీట్లను ఫోల్డ్ చేస్తే లగేజ్ స్పేస్ 890 లీటర్లకు పెరుగుతుందని పేర్కొంది.

మరిన్ని వార్తలు