సిద్ధార్థ అదృశ్యం : కొత్త ట్విస్ట్‌

30 Jul, 2019 19:39 IST|Sakshi

లేఖపై అనుమానాలు

సంతకం  సరిపోలడం  లేదు - ఐటీ శాఖ 

కెఫే  కాఫీ డే ఫౌండర్‌ వీజీ సిద్ధార్థ అదృశ్యం కేసులో  కొత్త ట్విస్ట్‌ వెలుగులోకి  వచ్చింది.  సిద్ధార్థ రాసినట్టుగా చెబుతున్న లేఖపై ఆదాయ పన్ను శాఖ అనుమానాలను  వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా  కెఫే కాఫీ డే వార్షిక నివేదికలో ఉన్న సిద్ధార్థ సంతకంతో, తాజా లేఖలోని సంతకం సరిపోలడం లేదని ఐటీ శాఖ అధికారులు భావిస్తున్నారని  తాజా సమాచారం ద్వారా తెలుస్తోంది. 

మరోవైపు  సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు డీకే శివకుమార్‌ కూడా సిద్ధార్థ అదృశ్యం,  లేఖపై  అనుమానం వ్యక్తం చేశారు. జూలై 28న తనకు కాల్‌ చేసి,  ఒకసారి కలవగలరా తనను అడిగారని  శివ కుమార్‌  ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఈ  నేపథ్యంలో  జూలై 27న సిద్ధార్థ  రాశారని చెబుతున్న లేఖ మర్మాన్ని ఆయన  ప్రశ్నిస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా సిద్ధార్థ కుటుంబంతో తనకు  సాన్నిహిత్యం వుందనీ, ఎంతో ధైర్యవంతుడైన సిద్దార్థ ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడంటే  నమ్మలేకపోతున్నానంటూ  శివకుమార్‌ ట్వీట్‌ చేశారు. దీనిపై సమగ్ర  దర్యాప్తు  చేయాలని కోరారు.

ఇది ఇలా వుంటే ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్ దాస్ పాయ్ ఈ సందర్భంగా ఐటీ అధికారుల వ్యవహార శైలిపై కొన్ని అభ్యంతరాలను లేవనెత్తారు. సిద్ధార్థ అదృశ్యంపై మీడియాతో మాట్లాడుతూ ఐటీ దాడుల సందర‍్భంగా ఆయా వ్యక్తులపై దాడి చేసిన ఘటనలు కూడా ఉన్నాయన్నారు. ఆదాయ పన్నుఎగవేత కేసులను, ఆరోపణలను చట్టపరంగా విచారించాలి తప్ప అవమానకరంగా వ్యవహరించడం తగదని వ్యాఖ్యానించారు. దీనిపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని కోరారు. దీనిపై తక్షణమే విచారణకు ఆదేశించాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆర్థికమంత్రి  నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. పన్ను చెల్లింపు దారులకు గౌరవం దక్కాలని మోహన్‌దాస్‌ అభిప్రాయపడ్డారు.

మరోవైపు  సిద్దార్థ ఆచూకీకోసం  కొనసాగుతున్న గాలింపు చర్యలు ఇంకా ఒక కొలిక్కిరాలేదు. 


 

మరిన్ని వార్తలు