వాహన ఉత్పత్తికి కోతలు..

10 Aug, 2019 05:38 IST|Sakshi

తగ్గిన డిమాండ్‌కు అనుగుణంగా మార్పులు

టాటా మోటార్స్, మహీంద్రా – మహీంద్రా నిర్ణయాలు

న్యూఢిల్లీ: మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా ఆటోమొబైల్‌ కంపెనీలు తమ ఉత్పత్తిని సవరించుకుంటున్నాయి. ప్రస్తుత త్రైమాసికంలో 8 నుంచి 14 రోజుల వరకు ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్టు మహీంద్రా అండ్‌ మహీంద్రా శుక్రవారం ప్రకటించింది. టాటా మోటార్స్‌ సైతం తగ్గుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తిని సవరించనున్నట్టు ధ్రువీకరించింది. 2019–20 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్‌) పలు ప్లాంట్లలో 8–14 రోజుల వరకు ఎటువంటి ఉత్పత్తి ఉండదంటూ స్టాక్‌ ఎక్సేంజ్‌లకు ఎంఅండ్‌ఎం సమాచారం ఇచ్చింది.

‘‘గతంలో పేర్కొన్నట్టుగానే.... వెలుపలి వాతావరణం ఇప్పటికీ సవాళ్లతో కూడుకుని ఉంది. డిమాండ్‌ తగ్గిపోతోంది. డిమాండ్‌కు అనుగుణంగా మా ఉత్పత్తిని మార్చుకోవడంతోపాటు, పనివేళల షిఫ్ట్‌లు, కాంట్రాక్టు సిబ్బందిని సర్దుబాటు చేసుకున్నాం’’అని టాటా మోటార్స్‌ స్పష్టం చేసింది. గత కొన్ని నెలలుగా వాహనాల అమ్మకాలు పడిపోతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌–జూన్‌ కాలంలో ఎంఅండ్‌ఎం దేశీయ వాహన అమ్మకాలు 8 శాతం క్షీణించి, 1,61,604 యూనిట్లుగా ఉన్నాయి.

ఎగుమతులతో కలిపి చూసినా కానీ అమ్మకాలు 8 శాతం తగ్గాయి. కస్టమర్ల నుంచి డిమాండ్‌ బలహీనంగా ఉండడంతో ఈ నెల అంతటా ఉత్పత్తిని నిలిపివేస్టున్నట్టు ఆటో విడిభాగాల తయారీ సంస్థ జామ్నా ఆటో గురువారమే ప్రకటించింది. వరుసగా ఆరో నెల జూలైలోనూ తాము ఉత్పత్తికి కోత విధించినట్టు మారుతీ సుజుకీ ఈ వారమే ప్రకటించింది. ఆటో విడిభాగాల దిగ్గజం బాష్‌ సైతం తాత్కాలికంగా తన రెండు ప్లాంట్లలో 13 రోజుల పాటు ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్టు తెలిపింది.   

జీఎస్‌టీని తగ్గించాలి: సియామ్‌
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను భారాన్ని తగ్గించి పరిశ్రమను ఆదుకోవాలని ఆటో ఇండస్ట్రీ ప్రభుత్వాన్ని ముక్తకంఠంతో డిమాండ్‌ చేస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 28 శాతం పన్ను రేటును 18 శాతానికి తగ్గించాలని ఆటోమొబైల్‌ తయారీ సంస్థల సమాఖ్య (సియామ్‌) కోరింది. అమల్లో ఉన్న రేటుకు 1–22 శాతం వరకు అదనపు సెస్‌ వర్తిస్తుండగా.. ఇప్పటికే పలు ఇబ్బందులను ఎదుర్కుంటున్న ఆటో పరిశ్రమను ఈ పన్నుల భారం మరింత కుంగదీస్తుందని వివరించింది. పన్ను తగ్గింపు డిమాండ్‌కు సమాఖ్యలోని అన్ని తయారీ సంస్థలతో పాటు ద్విచక్ర వాహనాల ప్రధాన తయారీ సంస్థ(ఓఈఎం)ల మద్దతు కూడకట్టుకుని ఏకగ్రీవ డిమాండ్‌ ఉన్నట్లు సియామ్‌ ప్రెసిడెంట్‌ రాజన్‌ వధేరా తెలియజేశారు. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో జరిగిన భేటీలో ప్యాసింజర్, వాణిజ్య, ద్విచక్ర విభాగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు ఉన్నట్లు స్పష్టంచేశారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా