వాహన రంగం బోణీ.. భేష్‌!

2 May, 2018 00:34 IST|Sakshi

ఏప్రిల్‌ నెల విక్రయాల్లో రెండంకెల వృద్ధి

టాటా ప్యాసింజర్‌ అమ్మకాలు ఏకంగా 34 శాతం జంప్‌

మహీంద్రా, మారుతీ సుజుకీ విక్రయాల్లో వరుసగా 19%, 14% వృద్ధి

ఫోర్డ్‌ ఇండియా విక్రయాలు మాత్రం దిగువకు  

న్యూఢిల్లీ: కొత్త ఆర్థిక సంవత్సరం వాహన పరిశ్రమకు శుభారంభాన్నిచ్చింది. ఆటోమొబైల్‌ కంపెనీలు వాటి ఏప్రిల్‌ నెల విక్రయాల్లో మంచి వృద్ధిని నమోదుచేశాయి. మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టాటా మోటార్స్‌ ఏకంగా రెండంకెల వృద్ధి సాధించాయి. హ్యుందాయ్‌ అమ్మకాల్లో ఒక అంకె వృద్ధి నమోదు కాగా... ఫోర్డ్‌ ఇండియా విక్రయాల్లో మాత్రం క్షీణత కనిపించింది.  

♦  దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) దేశీ వాహన అమ్మకాలు ఏప్రిల్‌ నెలలో 1,64,978 యూనిట్లు. గతేడాది ఇదే నెలలోని 1,44,492 యూనిట్ల విక్రయాలతో పోలిస్తే 14.2 శాతం వృద్ధి నమోదయ్యింది. కాంపాక్ట్‌ విభాగం కార్ల బలమైన అమ్మకాలు దీనికి ప్రధాన కారణంగా నిలిచింది.
♦  మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) దేశీ వాహన విక్రయాలు ఏప్రిల్‌లో 19.34 శాతం వృద్ధితో 37,889 యూనిట్ల నుంచి 45,217 యూనిట్లకు ఎగశాయి. ‘2017–18 ఆర్థిక సంవత్సరంలో మంచి వృద్ధిని సాధించాం. ఇప్పుడు 2018–19 ఆర్థిక సంవత్సరాన్ని కూడా బలమైన విక్రయాలతో ప్రారంభించాం. అటు ప్యాసింజర్, ఇటు కమర్షియల్‌ రెండు వాహన విభాగాల్లోనూ అమ్మకాలు బాగున్నాయి’ అని ఎంఅండ్‌ఎం ప్రెసిడెంట్‌ (ఆటోమోటివ్‌ విభాగం) రాజన్‌ వదేరా తెలిపారు.
టాటా మోటార్స్‌ దేశీ వాహన విక్రయాలు ఏకంగా 86 శాతం పెరిగాయి. ఇవి 28,844 యూనిట్ల నుంచి 53,511 యూనిట్లకు ఎగశాయి. అలాగే కంపెనీ ప్యాసింజర్‌ వాహన అమ్మకాలు 34 శాతం పెరిగాయి. ఇవి 12,827 యూనిట్ల నుంచి 17,235 యూనిట్లకు చేరాయి. మార్కెట్‌లో సవాళ్లున్నప్పటికీ టియాగో, టిగోర్, నెక్సాన్, హెక్సా వంటి మోడళ్లకున్న బలమైన డిమాండ్‌ కారణంగా ఏప్రిల్‌లో ఈ అమ్మకాలు సాధించగలిగామని టాటా మోటార్స్‌ ప్రెసిడెంట్‌ (ప్యాసింజర్‌ వెహికల్స్‌ బిజినెస్‌ యూనిట్‌) మయాంక్‌ పరీఖ్‌ తెలిపారు.
♦  హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా దేశీ వాహన విక్రయాల్లో 4.4 శాతం వృద్ధి నమోదయ్యింది. ఇవి 44,758 యూనిట్ల నుంచి 46,735 యూనిట్లకు పెరిగాయి.
♦  ఫోర్డ్‌ ఇండియా దేశీ వాహన అమ్మకాలు మాత్రం 2.49 శాతం క్షీణతతో 7,618 యూనిట్ల నుంచి 7,428 యూనిట్లకు తగ్గాయి.
♦  టూవీలర్ల విభాగంలో టీవీఎస్‌ మోటార్‌ తన మొత్తం వాహన అమ్మకాల్లో 24 శాతం వృద్ధిని ప్రకటించింది. ఇవి 3,04,795 యూనిట్లుగా ఉన్నాయి. ఇక కంపెనీ దేశీ టూవీలర్ల విక్రయాలు 17.6 శాతం వృద్ధితో 2,05,522 యూనిట్ల నుంచి 2,41,604 యూనిట్లకు చేరాయి.

మరిన్ని వార్తలు