వాహన విక్రయాల జోరు:టాప్‌ గేర్‌లో దిగ్గజాలు

1 Dec, 2017 19:37 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: నవంబర్‌  వాహనాల అమ్మకాల్లో దిగ్గజ కంపెనీలు దూసుకుపోయాయి.  మారుతి సుజుకి, హ్యుందాయ్, మహీంద్రా, టొయోటాతో సహా ఆటో  మేజర్లన్నీ  గత నెలలో ఆరోగ్యకరమైన  వృద్ధిని పోస్ట్ చేసాయి. భారీగా పుంజుకున్న అమ్మకాలతో డబుల్‌ డిజిట్‌ గ్రోత్‌ సాధించాయి. ఇయర్‌ ఆన్‌ ఇయర్‌ 26శాతం వృద్ధిచెందిన మొత్తంఅమ్మకాలు  6లక్షలకుపైగా నమోదయ్యాయి. గ్రామీణ మార్కెట్లలో డిమాండ్ పెరగడంతో పాటు కొత్త మోడళ్ళకు మంచి స్పందన లభిస్తోంది.

మారుతి సుజుకీ ఇండియా అమ్మకాలు 15 శాతం పెరిగి 1,45,300 యూనిట్లు విక్రయించగా .. గత ఏడాది నవంబర్లో 1,26,325 యూనిట్లు విక్రయించింది. ఇందులో స్విఫ్ట్, డిజైర్, బాలెనో కార్ల అమ్మకాలు 32.4 శాతం పెరిగి 65,447 యూనిట్లకు చేరుకున్నాయి. యుటిలిటీ వాహన విక్రయాలు, జిప్సీ, గ్రాండ్ విటారా, ఎర్టిగా, ఎస్-క్రాస్, కాంపాక్ట్ ఎస్యూవీ వీటారా బ్రెజ్జాలతో సహా నవంబర్ నెలలో 34 శాతం పెరిగి 23,072 యూనిట్లు విక్రయించింది. అయితే, ఆల్టో, వ్యాగన్ఆర్‌ సహా మినీ సెగ్మెంట్ కార్ల అమ్మకాలు 1.8 శాతం క్షీణించి 38,204 యూనిట్లు విక్రయించగా .. అక్టోబర్లో 38,886 యూనిట్లు అమ్ముడయ్యాయి.

హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఐఎల్) దేశీయ అమ్మకాల్లో 10 శాతం పెరిగి 44,008 యూనిట్లు విక్రయించింది. గ్రాండ్ ఐ 10, ఎలైట్ ఐ 20, క్రేతాతో పాటుగా తరువాతి తరానికి చెందిన వెర్నా బలమైన పనితీరు కారణంగా గత నెలలో వృద్ధి సాధించామని హెచ్ఎంఐఐఎల్ డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాత్సవ తెలిపారు   సెప్టెంబర్ నుంచి డిసెంబరు 2017 వరకూ గ్రామీణ ప్రాంతాల డిమాండ్‌తో పాటు, పండుగ సీజన్‌కారణంగా నమోదైన వృద్ధితో..2 లక్షల యూనిట్ల రిటైల్ అమ్మకాలను ఆశిస్తున్నట్టు చెప్పారు.

దేశీయ మార్కెట్లో మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాలు 21 శాతం వృద్ధితో 36,039 యూనిట్లు విక్రయించింది. ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో  స్కోర్పియో,  జియోలో, బొలోరో, వెరిటోలతో పోలిస్తే 21 శాతం పెరిగి 16,030 యూనిట్లు విక్రయించగా గత ఏడాది ఇదే నెలలో 13,198 యూనిట్లు విక్రయించింది. 2017 నవంబరు నెలలో సానుకూల వృద్ధి దశలో వున్నందుకు సంతోషిస్తున్నామని ఎం అండ్ ఎం ప్రెసిడెంట్ (ఆటోమోటివ్ సెక్టార్) రాజన్ వధేర తెలిపారు.

ఫోర్డ్  నవంబర్ నెలలో 13.1 శాతం వృద్ధితో 7,777 యూనిట్లు విక్రయించింది. టయోటా కిర్లోస్కర్ మోటార్ అమ్మకాల్లో 13 శాతం వృద్ధితో 12,734 యూనిట్లు విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో 11,309 యూనిట్లు విక్రయించింది. ఇక ద్విచక్ర వాహన విభాగంలో ద్విచక్ర వాహన అమ్మకాలు 21 శాతం పెరిగి 3,26,458 యూనిట్లు విక్రయించగా గత ఏడాది ఇదే నెలలో 2,69,948 యూనిట్లు విక్రయించింది.

ఐషర్‌ మోటార్స్ ద్విచక్ర వాహన విభాగంలోని రాయల్ ఎన్‌ఫీల్డ్‌ అమ్మకాలు 21 శాతం పెరిగి 7,776 యూనిట్లు విక్రయించగా గత ఏడాది ఇదే నెలలో 55,843 యూనిట్లగా నమోదైంది. సుజుకీ మోటార్‌ సైకిల్‌ ఇండియా అమ్మకాలు 42,722 యూనిట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో 30,830 యూనిట్లు విక్రయించగా .. 38.6 శాతం వృద్ధిని నమోదు చేసింది.

మరిన్ని వార్తలు