ఆటోమేషన్తో 20 కోట్ల ఉద్యోగాలు హుష్!

12 Dec, 2016 15:10 IST|Sakshi
ఆటోమేషన్తో 20 కోట్ల ఉద్యోగాలు హుష్!

2025 నాటికి 20 కోట్ల మేర ఉద్యోగాలకు గండి...
ఆటోమొబైల్, బ్యాంకింగ్ రంగ నియామకాలపై తీవ్ర ప్రభావం
పెరగనున్న రోబోల వినియోగం టి.వి.మోహన్‌దాస్ పాయ్

న్యూఢిల్లీ: ఆటోమేషన్, టెక్నాలజీ అభివృద్ధి వల్ల దేశంలో 2025 నాటికి 20 కోట్ల మంది మధ్యతరగతి యువతి/యువకులకు ఉపాధి అవకాశాలు దూరం కావొచ్చని మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ చైర్మన్ టి.వి.మోహన్‌దాస్ పాయ్ తెలిపారు. ‘2025 నాటికి 21-41 ఏళ్ల మధ్యలో ఉన్న వారి సంఖ్య 20 కోట్లుగా ఉంటుంది. వీరికి ఉద్యోగాలు దొరకవు. ఉపాధి అవకాశాలు తక్కువగా ఉంటారుు. వీరిని ఎలా ఉపయోగించుకోవాలో ఎవరికీ తెలియదు. ఆఖరికి వీరి గురించి ప్రభుత్వం వద్ద కూడా సరైన సమాచారం ఉండదు’ అని వివరించారు.

గతంలో ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ హెచ్‌ఆర్ డెరైక్టర్‌గా వ్యవహరించిన ఆయన ఇక్కడ జరిగిన ఏఐఎంఏ నేషనల్ హెచ్‌ఆర్‌ఎం సదస్సులో మాట్లాడారు. దాదాపు 52 శాతం మంది వ్యవసాయ రంగంలో ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. సేవలు, పరిశ్రమల రంగాలపై ఆధారపడ్డ వారి సంఖ్య 10 శాతంమేర పెరుగుతోందని తెలిపారు. ‘వ్యవసాయం, సేవల రంగంలోని ప్రజల మధ్య అసమానత్వం పెరిగిపోతోంది. ఈ అంశాన్ని మనం తప్పక పరిణనలోకి తీసుకోవాలి. ఇది పలు రాష్ట్రాల్లో ఆందోళనలకు కారణమౌతోంది’ అని పేర్కొన్నారు.

సృజనాత్మకత ఉద్యోగాలకు భయం లేదు
కంపెనీలు ఆటోమేషన్ వైపు చూస్తున్నాయని, దీని వల్ల కొన్ని రకాల ఉద్యోగాలు గల్లంతయ్యే అవకాశముందన్నారు. నియంత్రణల ఆధారంగా (రూల్ బేస్‌డ్) చేసే ఉద్యోగాలు కనుమరుగవుతాయని చెప్పారు. ఇవి ఆల్‌గరిథమ్ ప్రకారం పనిచేస్తాయని తెలిపారు. వీటిల్లో ఎక్కువగా మధ్యతరగతి ప్రజలే ఉంటారని పేర్కొన్నారు. ఇక సృజనాత్మకత అవసరమైన ఉద్యోగాలకు భయం లేదన్నారు. ఇప్పటికే ఫాక్స్‌కాన్ సంస్థ రోబోలతో పని చేరుుంచుకుంటోందని, అలాగే డ్రైవర్‌లెస్ కార్లు వస్తున్నాయని గుర్తుచేశారు. దీని వల్ల రానున్న కాలంలో ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పారు.

ఆటోమొబైల్, బ్యాంకింగ్ రంగాల్లోనే ఎక్కువ
భవిష్యత్‌లో రోబోలే రాజ్యమేలుతాయని అభిప్రాయపడ్డారు. పలు రంగాల్లో వీటి వినియోగం బాగా పెరుగుతుందని చెప్పారు. ‘రోబోలు 24 గంటలూ పనిచేస్తారుు. ఎలాంటి విరామం తీసుకోవు. బోనస్‌లు, వేతనాలు వంటి వాటితో పనిలేదు. మెట్రో నగరాలు కూడా ఆటోమేటెడ్ వైపు అడుగులేస్తున్నారుు. ఆటోమొబైల్ పరిశ్రమ ఈ ప్రపంచంలో ప్రతి ఆరుగురిలో ఒకరికి ఉపాధిని కల్పిస్తోంది. ఇలాంటి రంగం ఇప్పుడు ఆటోమేషన్ దిశగా పరిగెడుతోంది’ అని వివరించారు. ఏటీఎం, డిజిటల్ పేమెంట్స్ వంటి వాటి వల్ల చెల్లింపుల వ్యవస్థలో ఆటోమేషన్ ప్రవేశించడంతో బ్యాంకింగ్ రంగంలోనూ ఉపాధి అవకాశాలు ప్రభావితం అవుతాయని తెలిపారు. దీనికి అమెరికాను ఉదాహరణగా చెప్పుకోవచ్చన్నారు. ఆటోమేషన్ కారణంగా గడచిన కొన్ని ఏళ్లుగా కాల్ సెంటర్స్‌లో ఉద్యోగాలను తగ్గించుకుంటూ వస్తున్నామని మేక్‌మైట్రిప్ సహవ్యవస్థాపకుడు, సీఈవో రాజేశ్ మాగౌ తెలిపారు. 

>
మరిన్ని వార్తలు