ఆన్‌లైన్‌లో ఆటోమొబైల్ అమ్మకాలు

28 Apr, 2020 08:08 IST|Sakshi

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌తో షోరూమ్‌లు మూతబడిన నేపథ్యంలో ఆటోమొబైల్‌ కంపెనీలు అమ్మకాల కోసం కొంగొత్త మార్గాలు అన్వేషిస్తున్నాయి. తాజాగా ఆన్‌లైన్‌ బాట పడుతున్నాయి. డీలర్ల దగ్గరకు రావాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే కొనుగోళ్లు జరిపేందుకు వీలుగా సేల్స్‌ ప్లాట్‌ఫామ్‌ ప్రారంభించినట్లు హోండా కార్స్‌ ఇండియా సోమవారం వెల్లడించింది. ’హోండా ఫ్రమ్‌ హోమ్‌’ పేరిట ప్రత్యేక పథకాన్ని మొదలుపెట్టినట్లు వివరించింది. దీనితో దేశంలో ఎక్కడినుంచైనా, ఎప్పుడైనా బుకింగ్‌ చేసుకునే వెసులుబాటు ఉంటుందని హోండా కార్స్‌ తెలిపింది. త్వరలో దీన్ని దేశవ్యాప్తంగా అన్ని డీలర్‌షి‌లకు కూడా అనుసంధానం చేయనున్నట్లు సంస్థ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజేశ్‌ గోయల్‌ చెప్పారు. మరోవైపు, హ్యుందాయ్‌ కూడా ఇటీవలే క్లిక్‌ టు బై పేరిట ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ ప్రారంభించింది.  

ఫోక్స్‌వ్యాగన్, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్‌ కూడా  
జర్మనీకి చెందిన ఆటోమొబైల్‌ దిగ్గజాలు ఫోక్స్‌వ్యాగన్, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్‌ కూడా భారత్‌లో ఆన్‌లైన్‌ అమ్మకాలు ప్రారంభించినట్లు వెల్లడించాయి. ఇంటి నుంచే కస్టమర్లు తమకు నచ్చిన మోడల్‌ ఎంపిక చేసుకుని, బుక్‌ చేసుకునే వెసులుబాటు కల్పించేలా సేల్స్, సరీ్వస్‌ పోర్ట్‌ఫోలియోను డిజిటలీకరణ చేసినట్లు ఫోక్స్‌వ్యాగన్‌ తెలిపింది. అటు లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ సైతం ‘కాంటాక్ట్‌లెస్‌ ఎక్స్‌పీరియన్స్‌’ పేరిట ఆన్‌లైన్‌ విక్రయాలకు శ్రీకారం చుట్టింది. దీని ద్వారా కొత్త, ప్రీ–ఓన్డ్‌ బీఎండబ్ల్యూ కార్లను కొనుగోలు చేయొచ్చని, సరీ్వస్‌ బుక్‌ చేసుకోవచ్చని, ఆన్‌లైన్‌లోనే చెల్లింపులు జరపవచ్చని సంస్థ భారత విభాగం తాత్కాలిక ప్రెసిడెంట్‌ అర్లిండో టెక్సీరా తెలిపారు. ఇక మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా కూడా ’మెర్క్‌ ఫ్రం హోమ్‌’ పేరిట ఆన్‌లైన్‌ సేల్స్‌ ప్లాట్‌ఫాంను రూపొందించినట్లు వెల్లడించింది.  

మరిన్ని వార్తలు