వాహన రంగానికి ఎదురుదెబ్బ

11 Jan, 2020 03:38 IST|Sakshi

గతేడాది ఆటోమొబైల్‌ పరిశ్రమ అమ్మకాలు 13.77% డౌన్‌

ప్యాసింజర్‌ వాహన విక్రయాల్లో 12.75% తగ్గుదల

మునుపెన్నడూ లేనంత భారీ క్షీణత

న్యూఢిల్లీ: దేశీయ వాహన రంగ పరిశ్రమ గతేడాదిలో భారీ క్షీణతను నమోదుచేసింది. భారత ఆటోమొబైల్‌ తయారీదారుల సంఘం(సియామ్‌) శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 2019లో మొత్తం ఆటో రంగ పరిశ్రమ అమ్మకాలు 2,30,73,438 యూనిట్లు కాగా, అంతక్రితం ఏడాది (2018)లో అమ్ముడైన 2,67,58,787 యూనిట్లతో పోల్చితే ఏకంగా 13.77 శాతం తగ్గుదల చోటుచేసుకుంది. ఈ సంఘం వద్ద 1997 నుంచి ప్రతీ ఏడాదికి సంబంధించిన అమ్మకాల సమాచారం ఉండగా.. మునుపెన్నడూ లేని విధంగా గతేడాది విక్రయాలు భారీ క్షీణతను నమోదుచేశాయి.

ఇక ప్యాసింజర్‌ వాహన విక్రయాలు 29,62,052 యూనిట్లుగా నిలిచాయి. ఈ విభాగంలో 12.75 శాతం తగ్గుదల చోటుచేసుకుంది. 2013 తరువాత అత్యంత కనిష్టస్థాయి ఇది. ద్విచక్ర వాహన విభాగంలో 14.19 శాతం తగ్గుదల (1,85,68,280 యూనిట్ల విక్రయాలు) నమోదు కాగా, వాణిజ్య వాహన విభాగంలో 14.99 శాతం క్షీణత నమోదైంది. గతేడాది అమ్మకాలు ఈ స్థాయిలో పడిపోవడానికి.. భారత్‌ స్టేజ్‌–సిక్స్‌(బీఎస్‌–6) నిబంధనల అమలు వంటి ప్రభుత్వ నిర్ణయాలు, రుణ లభ్యత గణనీయంగా తగ్గిపోవడం ప్రధాన కారణాలుగా ఉన్నాయని సియామ్‌ ప్రెసిడెంట్‌ రాజన్‌ వడేరా వ్యాఖ్యానించారు. ఇక ఈ ఏడాదిలోనైనా ప్రభుత్వం జీఎస్‌టీ రేటును 18 శాతానికి తగ్గించి, స్క్రాపేజ్‌ విధానాన్ని అమలుచేస్తే పరిశ్రమ కోలుకుంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

మరిన్ని వార్తలు