అందుబాటు గృహాల పరిధిలోకే!

3 Jun, 2017 00:38 IST|Sakshi
అందుబాటు గృహాల పరిధిలోకే!

సీఎల్‌ఎస్‌ఎస్‌ కింద రూ.2.35 లక్షల వరకూ వడ్డీ రాయితీ
ఫ్లాట్లకే కాదు వ్యక్తిగత గృహాలు, పై అంతస్తులకూ రాయితీల వర్తింపు
నెల వేతనం లక్ష, లక్షన్నరైనా సరే కొనుగోలుకు అర్హులు
హైదరాబాద్‌లో 70 శాతం ఫ్లాట్లు ఈ కోవలోనివే
బడా నిర్మాణ సంస్థలూ ఈ తరహా ప్రాజెక్ట్‌లకే మొగ్గు
స్టాంప్‌ డ్యూటిని మినహాయిస్తే.. మరింత ఆదరణ: నిపుణుల సలహా


‘అందుబాటు గృహాలు’ అనగానే విస్తీర్ణం తక్కువుండే చిన్న ఫ్లాట్లని పట్టించుకోం! కానీ, మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. 1,350 చ.అ., 1,650 చ.అ. విస్తీర్ణంలోని ఫ్లాట్లూ వీటి పరిధిలోకే వస్తాయని!! అంతేకాదండోయ్‌.. గృహ రుణంలో రూ.2.35 లక్షల వరకు వడ్డీ రాయితీని కూడా పొందొచ్చు. లింగ భేదంతో సంబంధం లేకుండా ఏడాది వేతనం రూ.12, 18 లక్షల్లోçపున్న ఎవరైనా సరే అర్హులే! కాకపోతే తొలిసారి గృహ కొనుగోలుదారులై ఉండాలి సుమీ!!

సాక్షి, హైదరాబాద్‌: గతంలో 30 చ.మీ., 60 చ.మీ. లోపు ఉండే ఫ్లాట్లను మాత్రమే అందుబాటు గృహాలుగా పరిగణించేవారు. వాటికి మాత్రమే వడ్డీ రాయితీలందించేవారు. కానీ, ఫ్లాట్ల విస్తీర్ణం తక్కువగా ఉంటుండంతో నిర్మాణానికి డెవలపర్లు, కొనుగోళ్లకు కొనుగోలుదారులు ఇద్దరూ ముందుకొచ్చేవారు కాదు! దీంతో అందుబాటు గృహాల పథకం పెద్దగా సక్సెస్‌ కాలేకపోయింది. కానీ, కేంద్రమిప్పుడు అందుబాటు గృహాల విస్తీర్ణాలను పెంచేసింది. 90 చ.మీ., 110 చ.మీ. కార్పెట్‌ ఏరియాలుండే ఫ్లాట్లనూ వీటి పరిధిలోకి చేర్చింది. పైగా క్రెడిట్‌ ఇన్‌పుట్‌ సబ్సిడీ (సీఎల్‌ఎస్‌ఎస్‌) పథకం కింద వడ్డీ రాయితీలనూ అందిస్తుంది.

నెల జీతం లక్ష, లక్షన్నరైనా సరే అర్హులే..
నగరాల్లో నివసించే అల్పాదాయ వర్గాలతో పాటూ మధ్య, ఎగువ మధ్యతరగతి సొంతింటి కలను సాకా రం చేసేందుకు 90, 110 చ.మీ. (మిడిల్‌ ఇన్‌కం గ్రూ ప్‌ ఎంఐజీ) ఫ్లాట్లకూ కేంద్రం సబ్సిడీని అందిస్తుంది. ఏడాది వేతనం 6 నుంచి 12 లక్షల లోపు అంటే నెలకు లక్ష వేతనమున్న వారు రూ.30 లక్షల దాకా గృహ రుణం తీసుకొని రూ.2.35 లక్షల రాయితీని పొందవచ్చు. మిగిలిన మొత్తంపై మార్కెట్లో ఉండే వడ్డీ రేటు ఉంటుంది. కాకపోతే వీళ్లు కేవలం 90 చ.మీ. కార్పెట్‌ ఏరియా ఉంటే గృహాలను మాత్రమే ఎంచుకోవాలి. అంటే కనీసం 1,398 చ.అ. ఫ్లాట్లన్నమాట!

అలాగే ఏడాది వేతనం రూ.18 లక్షలు అంటే నెలకు లక్షన్నర జీతం ఆర్జించే వారు రూ.60 లక్షల దాకా గృహ రుణం తీసుకొని.. రూ.2.30 లక్షలు రాయితీ పొందవచ్చు. 110 చ.మీ. కార్పెట్‌ ఏరియా... అంటే 1,700 చ.అ. ఫ్లాట్లను మాత్రమే కొనుగోలు చేయాలి.
 1 చ.మీ.= 10.76 చ.అ.; కార్పెట్‌ ఏరియాను సూపర్‌ బిల్టప్‌ ఏరియాలోకి మారిస్తే.. బయటి గోడలు, మెట్లు, కారిడార్, క్లబ్‌ హౌజ్‌ వంటివి కలిపేయాలి. కార్పెట్‌ ఏరియాను ప్లింత్‌ ఏరియాకు మారిస్తే 20 శాతం, ప్లింత్‌ ఏరియాను సూపర్‌ బిల్టప్‌ ఏరియాకు మారిస్తే 18 శాతం స్థలం కలిసొస్తుంది. అంటే 90 చ.మీ. కార్పెట్‌ ఏరియా ఫ్లాట్‌ను చ.అ.ల్లోకి మారిస్తే 1,378 చ.అ., 110 చ.మీ. ఫ్లాట్‌ కాస్తా 1,700 చ.అ.లకు చేరుతుంది.

నోట్‌: ప్రాజెక్ట్‌ డిజైన్, కామన్‌ ఏరియాలను బట్టి ఫ్లాట్ల విస్తీర్ణాలు మారతాయి.

నిర్మాణంలో 20 వేల ఫ్లాట్లు..
అందుబాటు గృహాల విస్తీర్ణాలు పెరగడంతో హైదరాబాద్‌లో 70 శాతం నిర్మాణాలు వీటి పరిధిలోకే వస్తాయని భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్‌) తెలంగాణ ప్రెసిడెంట్‌ గుమ్మి రాంరెడ్డి తెలిపారు. ప్రస్తుతం నిర్మాణంలో 20 వేల ఫ్లాట్ల వరకుంటాయని.. వచ్చే 23 ఏళ్లలో సుమారు 40 వేల యూనిట్లొస్తాయని అంచనా వేశారాయన. 90 చ.మీ. ఫ్లాట్లు వనస్థలిపురం, ఎల్బీనగర్, ఉప్పల్‌ వంటి తూర్పు జోన్‌లో, 110 చ.మీ. ఫ్లాట్లు పశ్చిమ జోన్‌లో మినహా నగరమంతా విస్తరించి ఉన్నాయి. వెస్ట్‌ జోన్‌లో ఇంకాస్త ఎక్కువ విస్తీర్ణంలో ఫ్లాట్లు, విల్లాలుంటాయని వివరించారు. ఫ్లాట్ల సైజులూ పెరగడంతో సామాన్యులే కాదు మధ్య, ఎగువ మధ్య తరగతి ప్రజలూ ఈ గృహాల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. డిమాండ్‌ కారణంగా నిర్మాణ సంస్థలూ ఈ తరహా ప్రాజెక్ట్‌లకే మొగ్గు చూపుతున్నాయి. గిరిధారి, శాంతా శ్రీరామ్, జనప్రియ, రామ్‌ కన్‌స్ట్రక్షన్స్, ప్రణీత్‌ గ్రూప్, అపర్ణా, ఎస్‌ఎంఆర్‌ వంటి నగరంలోని దాదాపు అన్ని నిర్మాణ సంస్థలూ ఈ తరహా ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నాయి.

పై అంతస్తు వేసుకున్నా సరే రాయితీలు..
పీఎంఏవై, సీఎల్‌సీసీ రాయితీలు కేవలం నిర్మాణ సంస్థలు కట్టే ఫ్లాట్ల కొనుగోలుకు మాత్రమే కాదండోయ్‌.. సొంతంగా దగ్గరుండి కట్టించుకునే ఫ్లాట్లకు, వ్యక్తిగత గృహాలకూ వర్తిస్తాయి. అప్పటికే సొంతిల్లు ఉండి.. దాని మీద మరో అంతస్తు వేసుకున్నా సరే రాయితీలు పొందవచ్చు. కాకపోతే అందుబాటు గృహాల కార్పెట్‌ ఏరియా నిబంధనలకు లోబడి మాత్రమే ఆయా గృహాల విస్తీర్ణాలుండాలన్న విషయాన్ని మరిచిపోవద్దు. అందుబాటు గృహాల కూడా స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి బిల్లు (రెరా) పరిధిలోకి వస్తాయి కాబట్టి నిర్మాణ సంస్థలూ గడువులోగా ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తాయి.

అందుబాటు గృహాలకు ఆదాయానికి లింకేంటి?
అందుబాటు గృహాల కొనుగోలుకు, కస్టమర్ల ఆదాయ ఆర్జనకు లింకు పెట్టడం సరైంది కాదు. ఎందుకంటే కొనుగోలుదారులు తమ ఆదాయ పరిమితిని బట్టి ఇళ్లను ఎంచుకోవాల్సి వస్తుంది. దీంతో 30,60 చ.మీ.చిన్న సైజు గృహాలు ఆదరణకు నోచుకోవటం లేదు. ఉదాహరణకు నెల జీతం రూ.50 వేల లోపుండే వాళ్లు కేవలం 60 చ.మీ. ఇళ్లను మాత్రమే కొనుగోలు చేయాలనే నిబంధన ఉంది. 60 చ.మీ. కార్పెట్‌ ఏరియా అంటే సుమారు 750800 చ.అ. ఫ్లాటన్నమాట. మరి, నగరంలో ఈ విస్తీర్ణంలో ఎన్ని ఫ్లాట్లుంటాయి? ఒకవేళ ఉన్నా ఈ చిన్న సైజు ఫ్లాట్లను ఎంతమంది కొనుగోలు చేస్తారనేది సందేహం. ఎంఐజీ ఫ్లాట్ల కొనుగోలులోనూ అంతే! నెలకు లక్ష, లక్షన్నర ఆదాయం ఉన్నవాళ్లు ఈ గృహాల కొనుగోలుకు అర్హులు. పైగా తొలిసారి గృహ కొనుగోలుదారులకు మాత్రమే పథకం వర్తిస్తుందనే నిబంధన ఉంది. ఒక్కముక్కలో చెప్పాలంటే అందుబాటు గృహాల పథకం విజయవంతం కావాలంటే ఆదాయ ఆర్జన పరిమితిని తీసేయాలని ఏవీ కన్‌స్ట్రక్షన్‌ ఎండీ వెంకట్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు.

స్టాంప్‌ డ్యూటీని మినహాయిస్తేనే.. సక్సెస్‌
అందుబాటు గృహాల పథకం రాష్ట్ర స్థాయిలోనూ విజయవంతం కావాలంటే స్థానిక ప్రభుత్వం స్టాంప్‌ డ్యూటీని మినహాయించాలి. స్థానిక సంస్థల ఫీజులు, సర్వీస్‌ ట్యాక్స్, వ్యాట్, నాలా పన్నుల్లో రాయితీలు కల్పించాలి. అప్పుడే నిర్మాణానికి డెవలపర్లు, కొనుగోళ్లకు కొనుగోలుదారులూ ముందుకొస్తారు. స్టాంప్‌ డ్యూటీ మినహాయింపనేది కొత్త డిమాండ్‌ ఏమీ కాదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో 1,200 చ.అ. లోపు గృహాల కొనుగోలుదారులకు స్టాంప్‌ డ్యూటీలో రాయితీని కల్పించారు.
– తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌ (టీబీఎఫ్‌) జనరల్‌ సెక్రటరీ జే వెంకట్‌ రెడ్డి

మరిన్ని వార్తలు