విస్తీర్ణం తగ్గింది

28 Sep, 2019 00:50 IST|Sakshi

ఐదేళ్లలో 27 శాతం తగ్గిన ఫ్లాట్ల సైజ్‌ గృహాల విస్తీర్ణం తగ్గుతోంది.

అఫడబుల్, మిడ్,ప్రీమియం, లగ్జరీ, అల్ట్రా లగ్జరీ.. ఇలా అన్ని విభాగాల్లోని అపార్ట్‌మెంట్ల సైజ్‌లు తగ్గిపోతున్నాయి.

గత ఐదేళ్లలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఫ్లాట్ల విస్తీర్ణం 27 శాతం క్షీణించాయని అనరాక్‌ నివేదిక తెలిపింది.

నిధుల సమస్య, అందుబాటు గృహాలకు డిమాండ్, కస్టమర్ల అభిరుచులుమారుతుండటం వంటివి క్షీణతకుకారణమని పేర్కొంది.

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోని ప్రధాన నగరాల్లో 2014లో అపార్ట్‌మెంట్‌ సగటు విస్తీర్ణం 1,400 చ.అ.గా ఉండేది. కానీ, 2019 నాటికది 1,020 చ.అ.లకు తగ్గింది. అత్యధికంగా ముంబైలో ఫ్లాట్ల సైజ్‌లు 45 శాతం మేర తగ్గిపోయాయి. 2014లో ఇక్కడ ప్రాపర్టీల సగటు విస్తీర్ణం 960 చ.అ. కాగా.. ఇప్పుడది 530 చ.అ. పడిపోయింది. పుణేలో అయితే క్షీణత 38 శాతంగా ఉంది. ప్రస్తుతమిక్కడ సగటు విస్తీర్ణం 600 చ.అ.లుగా ఉంది. ఇక, ఎన్‌సీఆర్‌లో 6 శాతం క్షీణతతో 1,390 చ.అ.లకు, బెంగళూరులో 9 శాతం క్షీణించి 1,300 చ.అ.లకు, చెన్నైలో 8 శాతం క్షీణతతో అపార్ట్‌మెంట్‌ సగటు సైజ్‌ 1,190 చ.అ.లకు చేరింది. హైదరాబాద్‌లో సగటు అపార్ట్‌మెంట్‌ విస్తీర్ణం 1,570 చ.అ.లుగా ఉంది. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే ఇదే అతిపెద్ద విస్తీర్ణం. ఐదేళ్ల క్రితం కోల్‌కతాలో ఫ్లాట్‌ సైజ్‌ 1,230 చ.అ.లుగా ఉండేది. ఇప్పుడక్కడ సగటు విస్తీర్ణం 9 శాతం క్షీణించి 1,120 చ.అ.లుగా ఉంది. 

విభాగాల వారీగా విస్తీర్ణం ఎంత తగ్గిందంటే.. 
రూ.40 లక్షల లోపు ధర ఉన్న అందుబాటు గృహాల విస్తీర్ణం ఐదేళ్లలో 28 శాతం తగ్గాయి. 2014లో 750 చ.అ.లుగా ఉన్న అఫడబుల్‌ హౌజ్‌ సైజ్‌లు 2019 నాటికి 540 చ.అ.లకు తగ్గిపోయాయి. 
రూ.40 లక్షల నుంచి రూ.80 లక్షల మధ్య ధర ఉన్న మధ్యస్థాయి గృహాల విస్తీర్ణం 17 శాతం తగ్గాయి. 2014లో 1,150 చ.అ.లు కాగా.. ఇప్పుడవి 950 చ.అ.లకు క్షీణించాయి. 
రూ.80 లక్షల నుంచి రూ.1.25 కోట్ల ధర ఉన్న ప్రీమియం హోమ్స్‌ విస్తీర్ణం 21 శాతం తగ్గాయి. 2014లో 1,450 చ.అ.లుండగా.. ఇప్పుడవి 1,140 చ.అ.లకు తగ్గిపోయాయి. 
రూ.1.5 కోట్ల నుంచి రూ.2.5 కోట్ల ధర ఉన్న లగ్జరీ గృహాల సైజ్‌ 18 శాతం క్షీణించాయి. 1,640 చ.అ. నుంచి 1,350 చ.అ.లకు తగ్గాయి.
రూ.2.5 కోట్ల కంటే ఎక్కువ ధర ఉండే అల్ట్రా లగ్జరీ గృహాల విస్తీర్ణం 8 శాతం తగ్గాయి. ఐదేళ్ల క్రితం ఆయా ఫ్లాట్ల సైజ్‌ సగటు 2,400 చ.అ.లు ఉండగా.. ఇప్పుడవి 2,200 చ.అ.లకు తగ్గిపోయాయి. 

తక్కువ విస్తీర్ణం గృహాలకే డిమాండ్‌.. 
ప్రధాన నగరాల్లో అందుబాటు గృహాలకు డిమాండ్‌ పెరగడమే అపార్ట్‌మెంట్ల విస్తీర్ణం తగ్గడానికి ప్రధాన కారణమని అనరాక్‌ ప్రాపర్టీ కన్సల్టెన్సీ చైర్మన్‌ అనూజ్‌ పూరీ తెలిపారు. అఫడబుల్‌ హౌసింగ్‌కు ప్రభుత్వం రాయితీలు ఇస్తుండటంతో కొనుగోలుదారులు ఈ గృహాల వైపే మొగ్గుచూపుతున్నారన్నారు. అయితే ఆయా అఫడబుల్‌ గృహాలు రూ.45 లక్షల లోపు ధర 850 చ.అ. బిల్టప్‌ ఏరియాను మించకూడదు. అప్పుడే ప్రభుత్వం నుంచి రాయితీలు అందుతాయి. అంతేకాకుండా అఫడబుల్‌ గృహాలకు జీఎస్‌టీ కూడా తక్కువే. ఇతర గృహాలకు జీఎస్‌టీ 5 శాతం ఉంటే అఫడబుల్‌ ప్రాజెక్ట్‌లకు ఒక్క శాతమే ఉంది.

మరిన్ని వార్తలు