గాల్లో దూసుకెళ్తున్నాం..

8 Mar, 2018 19:33 IST|Sakshi

సివిల్‌ ఏవియేషన్‌ సెక్రటరీ చౌబే

సాక్షి, హైదరాబాద్‌: ‘స్వాతంత్ర్యం వచ్చిన 60 ఏళ్లలో దేశంలోని 75 ఎయిర్ పోర్టులు డెవలప్ చేశాం. ప్రతీ ప్రధాన పట్టణానికి ఎయిర్ కనెక్టివిటీ ఉంద’ ని సివిల్‌ ఏవియేషన్‌ సెక్రటరీ రాజీవ్‌ నారాయణ్‌ చౌబే అన్నారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో గురువారం ప్రారంభమైన ఏవియేషన్‌ షో లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఏవియేషన్ ఇండస్ట్రీ ప్రతి ఏడాది 26 శాతం వృద్ధితో దూసుకెళ్తోందని తెలిపారు. సివిల్‌ ఏవియేషన్‌లో ఈ ఏడాది 17.5 శాతం వృద్ధి నమోదైందని పేర్కొన్నారు. మూడేళ్ల క్రితం మన దేశంలో 395 ఎయిర్ క్రాఫ్ట్‌లు ఉండేవి.. ప్రస్తుతం వాటి సంఖ్య 900కి చేరిందన్నారు.

ఉడాన్ పథకంలో భాగంగా 51 ఎయిర్ పోర్టులను డెవలప్ చేస్తున్నామని అన్నారు.వీటిలో18 ఎయిర్ పోర్టులు ఇప్పటికే తమ ఆపరేషన్స్ ప్రారంభించాయని వెల్లడించారు. వచ్చే నాలుగేళ్లలోమరో వంద పట్టణాలకు ఎయిర్ కనెక్టివిటీని అందించడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఇంధన ధరలు స్థిరంగా ఉంటే వచ్చే 20 ఏళ్లలో 15 శాతం వృద్ధితో ఏవియేషన్ ఇండస్ట్రీ పరుగులు పెడుతుందని ఆకాక్షించారు. 

కేంద్రం ఎయిర్ పోర్ట్ ఆఫ్ ఇండియా యాక్ట్‌లో మార్పులు తెచ్చే అవకాశం ఉందన్నారు. టికెట్ ధరలు తగ్గిస్తేనే సామాన్యుడు విమాన ప్రయాణం చేయగలడని స్పష్టం చేశారు. పెరుగుతున్న ఇంధన ధరల వల్ల విమానయాన కంపెనీలు భారాన్ని మోస్తున్నాయని.. జీఎస్టీ లోకి విమానయాన సర్వీసులను తీసుకురావడం వల్ల ఏవియేషన్ ఇండస్ట్రీ వృద్ధి పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా భారత ఏవియేషన్‌ రంగం ప్రపంచ వ్యాప్తంగా మూడవ స్థానంలో ఉండటం గమనార్హం.

మరిన్ని వార్తలు