ఏవియేషన్‌ షేర్లకు చమురు సెగ

24 Sep, 2018 15:44 IST|Sakshi

సాక్షి,ముంబై:  దడ పుట్టిస్తున్న క్రూడ్‌ ఆయిల్‌ ధరల నేపథ్యంలో  విమానయాన సంస్థలకు షేర్లు పతనం  వైపు పరుగులు తీశాయి.  బ్రెంట్ క్రూడ్ చమురు ధరలు అంతర్జాతీయ వాణిజ్యంలో బ్యారెల్ మార్కుకు 80 డాలర్లు దాటడంతో సోమవారం  ఏవియేషన్‌ సెక్టార్‌లో అమ్మకాలకు తెరతీసింది. అటు న్యూయార్క్‌ మార్కెట్లో నైమెక్స్‌ చమురు బ్యారల్‌ 72 డాలర్లను తాకింది.

సోమవారం ఉదయం ఒకేసారి రెండు శాతం పెరగడంతో   స్సైస్‌ జెట్‌   4.15 శాతం నష్టపోయి 73.85 స్థాయికి పడిపోయింది. గత ఏడాదితో పోలిస్తే ఈ స్టాక్ 47.85 శాతం నష్టపోయింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి 48.78 శాతం కోల్పోయింది. దీంతో తాజా 52 వారాల కనిష్ట స్థాయిని తాకింది.  ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ స్టాక్ 6 శాతం క్షీణించింది. గత ఏడాది నుంచి 22.48 శాతం కోల్పోయి ఇది కూడా  లైఫ్‌ టైం  కనిష్టాన్ని నమోదు  చేసింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ కూడా  7.70 శాతం పడిపోయింది.

ఇరాన్‌పై ఆంక్షలు అమలు గడువు దగ్గరపడేకొద్దీ అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు జెట్‌ స్పీడుతో పరుగులు తీస్తున్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ఇప్పటికే 80 డాలర్లకు చేరగా, నవంబర్‌ నెలకల్లా 90 డాలర్లు, ఏడాది చివరికల్లా 100 డాలర్లకు చేరుతుందని ట్రేడర్లు అంచనా వేస్తున్నారు. ఇరాన్ ఆంక్షలు కారణంగా రాబోయే నెలల్లో చమురు ధర బ్యారెల్‌కు  90 డాలర్లు ఉంటుందని జెపి మోర్గాన్ తన తాజా మార్కెట్ విశ్లేషణలో పేర్కొంది. మరోవైపు ఇంధన ధరల పెరుగుదలతో  దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రో సెగ కొనసాగుతోంది. గత ఐదు వారాల్లో 71 డాలర్ల నుంచి బ్యారెల్ 80 డాలర్లకు చేరుకుంది. ముడి చమురు దిగుమతిలో మూడవ స్థానంలో  ఉన్న భారత్‌లో  ఇంధన భారాలు తగ్గించేందుకు చర్యలు చేపట్టాలనే డిమాండ్‌ ఊపందుకుంటోంది. 

మరిన్ని వార్తలు