రేటింగ్‌ దెబ్బ- యాక్సిస్‌- బజాజ్‌ ఫైనాన్స్‌ 

29 Jun, 2020 11:43 IST|Sakshi

ఎస్‌అండ్‌పీ డౌన్‌గ్రేడ్‌ ఎఫెక్ట్‌

యాక్సిస్‌ 4.5 శాతం పతనం

బజాజ్‌ ఫైనాన్స్‌ 4 శాతం డీలా

గత నెల రోజుల్లో ఈ షేర్ల ర్యాలీ

ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ వారాంతాన ప్రయివేట్‌ రంగ దిగ్గజం యాక్సిస్‌ బ్యాంక్‌, ఎన్‌బీఎఫ్‌సీ బ్లూచిప్‌.. బజాజ్‌ ఫైనాన్స్‌ల క్రెడిట్‌ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసింది.  కోవిడ్‌-19 దెబ్బతో దేశీయంగా బ్యాంకులు, ఫైనాన్షియల్‌ సంస్థలకు ఆర్థికపరమైన రిస్కులు పెరుగుతున్నట్లు ఈ సందర్భంగా ఎస్‌అండ్‌పీ పేర్కొంది. యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ రేటింగ్‌ను BB+/స్థిరత్వం/Bకు సవరించింది. గతంలో BBB-/ప్రతికూలం/A3 రేటింగ్‌ను ఇచ్చింది. అంతేకాకుండా దుబాయ్‌ అంతర్జాతీయ ఫైనాన్షియల్‌, గిఫ్ట్‌ సిటీ, హాంకాంగ్‌ బ్రాంచీల రేటింగ్స్‌ను సైతం BBB- నుంచి తాజాగా BB+కు డౌన్‌గ్రేడ్‌ చేసింది. ఈ బాటలో  ఎన్‌బీఎఫ్‌సీ.. బజాజ్‌ ఫైనాన్స్‌ క్రెడిట్‌ రేటింగ్‌ను సైతం ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ తాజాగా డౌన్‌గ్రేడ్‌ చేసింది. గతంలో ఇచ్చిన BBB-/ప్రతికూలం/A3 రేటింగ్‌ను  BB+/స్థిరత్వం/Bకు సవరించింది.  యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ల రుణ నాణ్యత క్షీణించడంతోపాటు.. క్రెడిట్‌ వ్యయాలు పెరిగే వీలున్నట్లు ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ పేర్కొంది. ఫలితంగా లాభదాయకత క్షీణించనున్నట్లు అంచనా వేసింది. బాండ్లను BB కేటగిరీకి సవరిస్తే ‘జంక్‌’ స్థాయి  రేటింగ్‌కు చేరినట్లేనని విశ్లేషకులు పేర్కొన్నారు.  దేశీయంగా బ్యాంకింగ్‌ వ్యవస్థ ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్ల(ఎకనమిక్‌ రిస్కులు) నేపథ్యంలో ఆస్తుల(రుణాలు) నాణ్యత, ఆర్థిక పనితీరు నీరసించే వీలున్నట్లు ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ అభిప్రాయపడింది. 

నేలచూపులో
ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో యాక్సిస్‌ బ్యాంక్‌ షేరు 4.5 శాతం పతనమై రూ. 406 దిగువన ట్రేడవుతోంది. తొలుత రూ. 402 వరకూ జారింది. ఇక బజాజ్‌ ఫైనాన్స్‌ కౌంటర్లోనూ అమ్మకాలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 4  శాతం నీరసించి రూ. 2793 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 2770 వద్ద కనిష్టాన్ని తాకింది. కాగా.. గత నెల రోజుల్లో యాక్సిస్‌ బ్యాంక్‌ షేరు 25 శాతం లాభపడగా.. బజాజ్‌ ఫైనాన్స్‌ 59 శాతం ర్యాలీ చేయడం గమనార్హం!

మరిన్ని వార్తలు