బంగారం వర్తకుల ఖాతాలు ఫ్రీజ్‌!

13 Dec, 2016 00:47 IST|Sakshi
బంగారం వర్తకుల ఖాతాలు ఫ్రీజ్‌!

పలువురి ఖాతాల్ని నిలిపేసిన యాక్సిస్‌ బ్యాంకు
నోట్ల రద్దు తరవాత భారీ విక్రయాలే కారణం


ముంబై: నోట్ల రద్దు అనంతరం బంగారం కొనుగోళ్లకు సహకరించిన పలువురు బులియన్‌ వర్తకులు, డీలర్ల ఖాతాలను యాక్సిస్‌ బ్యాంకు స్తంభింపజేసింది. ఇలాంటి వర్తకులకు సహకరించారన్న ఆరోపణలపై ఒక బ్రాంచిలో ఇద్దరు యాక్సిస్‌ బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌లు ఇప్పటికే అరెస్టయిన విషయం తెలిసిందే. ‘‘పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కొన్నిచోట్ల అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు, విచారణ నేపథ్యంలో కొన్ని కరెంటు ఖాతాల్లో లావాదేవీల్ని తాత్కాలికంగా నిలుపుచేస్తున్నాం’’ అని బ్యాంకు తెలియజేసింది. ఇప్పటికే 10 నెలల కనిష్ట స్థాయిలో ఉన్న పసిడి ధరపై ఈ చర్య ప్రభావం చూపిస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

నిజానికి పెద్ద నోట్లను రద్దుచేశాక కొందరు నల్లకుబేరులు తమ దగ్గరున్న సొమ్మును తెలుపు చేసుకోవటానికి 50 శాతం ఎక్కువ ధర పెట్టి కూడా భారీగా పసిడి కొన్నారు. ఇందుకు సహకరించారని ఇద్దరు యాక్సిస్‌ బ్యాంక్‌ ఉద్యోగులను గతవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలోనే పలు బులియన్‌ డీలర్లు, ఆభరణాల వర్తకుల అకౌంట్లను నిలుపుచేసినట్లు బ్యాంకు ప్రకటించింది. ‘‘తగిన విచారణ అనంతరం తప్పు లేదని తేలితే వారి ఖాతాల్ని పునరుద్ధరిస్తాం’’ అని బ్యాంకు తెలియజేసింది. కాగా బ్యాంకు ఎలాంటి కారణం చెప్పకుండానే తమ ఖాతా నిలిపేసినట్లు పేరు వెల్లడికావటానికి ఇష్టపడని చెన్నై బంగారం డీలర్‌ ఒకరు తెలిపారు.  

33 శాతం కొనుగోళ్లు అడ్డగోలే!
దేశంలో ఏటా దాదాపు 800 టన్నుల పసిడికి డిమాండ్‌ ఉంది. దీన్లో మూడో వంతు కొనుగోళ్లు ‘‘బ్లాక్‌ మనీ’’తోనే అనే వాదన ఉంది. నవంబర్లో పసిడి దిగుమతులు 11 నెలల గరిష్ట స్థాయిలో దాదాపు 100 టన్నులు పెరిగాయి. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో జరిగిన నోట్ల పంపిణీ అవకతవకలపై యాక్సిస్‌ గత వారం 19 మంది ఉద్యోగుల్ని సస్పెండ్‌ చేసింది.

బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు... వదంతే: ఆర్‌బీఐ
నోట్ల రద్దు నేపథ్యంలో కొన్ని బ్రాంచీల్లో అవకతవకలు చోటుచేసుకున్నట్లు వచ్చిన ఆరోపణలకు సంబంధించి యాక్సిస్‌ బ్యాంకు లైసెన్సును రద్దు చేస్తున్నట్లు వదంతులొస్తున్నాయని, వాటిలో నిజం లేదని ఆర్‌బీఐ తెలియజేసింది. ఇదే విషయాన్ని బీఎస్‌ఈకి యాక్సిస్‌ బ్యాంకు తెలిపింది. ‘‘బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు వార్తలను పూర్తిగా తోసిపుచ్చుతున్నాం. ఆర్‌బీఐ నిర్దేశిస్తున్న విధంగా పటిష్ట యంత్రాంగం, నిర్వహణ వ్యవస్థలకు లోబడి బ్యాంకు పనిచేస్తోంది’’ అని యాక్సిస్‌ పేర్కొంది. తాజా పరిణామాలతో యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్‌ విలువ 2.5 శాతం తగ్గి, రూ.445 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు