కొత్త సీఈఓ కోసం ఆ బ్యాంకు వెతుకులాట

11 Apr, 2018 11:01 IST|Sakshi

ముంబై : ప్రైవేట్‌ రంగంలో మూడో అతిపెద్ద బ్యాంకు అయిన యాక్సిస్‌ బ్యాంకు తన కొత్త సీఈఓ కోసం వెతుకులాట ప్రారంభించింది. కేవలం ఎనిమిది నెలల్లో శిఖా శర్మ తన పదవి నుంచి దిగిపోతుండగా.. కొత్త సీఈఓను నియామకంపై బ్యాంకు దృష్టిసారించినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ఈ పోస్టు కోసం ఆరుగురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఒకరిని బోర్డు-సబ్‌కమిటీ ఫైనలైజ్‌ చేయనున్నట్టు తెలుస్తోంది.  

యాక్సిస్‌ బ్యాంకు కొత్త సీఈఓ కోసం పోటీ పడే వారిలో గోల్డ్‌మ్యాన్‌ సాచ్స్‌ ఇండియా సంజయ్‌ ఛట్టర్జీ, కేకేఆర్‌ కంట్రీ హెడ్‌ సంజయ్‌ నాయర్‌, మాజీ డ్యుయిస్‌ బ్యాంకు ఆసియా-పసిఫిక్‌ చీఫ్‌ గునీత్‌ చదా, సిటీ గ్రూప్‌ ఇండియా సీఈవో ప్రమీత్‌ జావేరీలు ఉన్నట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఛట్టర్జీ పేరు అంతకముందు ఐసీఐసీఐ బ్యాంకు సీఈఓగా కేవీ కామత్‌ పదవి విరమణ చేసినప్పుడు కూడా వినిపించింది. కానీ తర్వాత చందా కొచర్‌ను నియమించారు. మిగతా ఇద్దరు బ్యాంకులోని అంతర్గత అభ్యర్థులే ఉన్నారు. వారిలో ఒకరు రిటైల్‌ హెడ్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ ఆనంద్‌ కాగ, మరొకరు బ్లాక్‌రాక్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ట్రస్ట్‌ కంపెనీ మాజీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌, బ్యాంకు ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌ రోహిత్‌ భగత్‌ ఉన్నారు. 

అయితే ఇంతకముందే తాను కొత్త సవాళ్లను స్వీకరించడానికి ఆసక్తితో ఉన్నానంటూ యాక్సిస్‌ బ్యాంకు డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీ శ్రీనివాసన్‌ చెప్పారు. ఒకవేళ ఆయనను కూడా సీఈఓ పోస్టుకు పరిగణలోకి తీసుకోవచ్చని తెలుస్తోంది. మరోవైపు సెంట్రల్‌ బ్యాంకు నిబంధనలకు తగిన వారినే బ్యాంకు సీఈఓగా నియమించాలని బోర్డును ఆర్‌బీఐ ఆదేశించే అవకాశం కూడా కనిపిస్తోంది. అటు వీడియోకాన్‌ గ్రూప్‌ రుణ వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ బ్యాంకు కూడా తాత్కాలిక సీఈఓను నియమించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ  తాత్కాలిక సీఈఓను బ్యాంకు నియమించాల్సి వస్తే, ఆయన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ చీఫ్‌ సందీప్‌ భక్షి ఉండొచ్చని సమాచారం.  

మరిన్ని వార్తలు