వాట్సాప్‌ చెల్లింపుల ప్రాసెస్‌కు ఈ బ్యాంకు సిద్ధం

14 Mar, 2018 09:18 IST|Sakshi

సాక్షి, బెంగళూర్‌ : చాటింగ్‌ అప్లికేషన్‌ వాట్సాప్‌ ద్వారా చెల్లింపులను త్వరలో ప్రాసెస్‌ చేయనున్నట్టు భారత్‌లో మూడవ అతిపెద్ద ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం యాక్సిస్‌ బ్యాంక్‌ వెల్లడించింది. ఈ సర్వీస్‌ అందుబాటులోకి వస్తే దేశంలో యూపీఐ ఆధారిత వాట్సాప్‌ పేమెంట్స్‌ ప్రాసెసింగ్‌ను తొలిసారి చేపట్టిన సంస్థగా యాక్సిస్‌ బ్యాంక్‌ నిలవనుంది. వాట్సాప్‌ పేమెంట్స్‌ ఫీచర్‌ ద్వారా యాప్‌ యూజర్లు పేటీఎం, మొబిక్విక్‌, ఇతర పేమెంట్స్‌ సేవల మాదిరిగా నేరుగా డబ్బును పంపడంతో పాటు రిసీవ్‌ చేసుకోవచ్చు. ‘వాట్సాప్‌ బీటా వెర్షన్‌ ప్రస్తుతం నడుస్తోంది..పూర్తి వెర్షన్‌ ఒకట్రెండు నెలల్లో అందుబాటులోకి వస్తుంద’ని యాక్సిక్‌ బ్యాంక్‌ వర్గాలు పేర్కొన్నాయి.

యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) గొప్ప అవకాశమని బ్యాంక్‌ పేర్కొంది. చెల్లింపుల్లో యూపీఐ వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టిందని..తమ కస్టమర్లకు ఈ సేవలను అందించేందుకు కసరత్తు సాగిస్తున్నామని యాక్సిస్‌ బ్యాంక్‌ రిటైల్‌ బ్యాంకింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ ఆనంద్‌ పేర్కొన్నారు. కస్టమర్లు చెల్లింపులు చేసుకునేందుకు అవసరమైన వ్యవస్థను సిద్ధం చేసే క్రమంలో గూగుల్‌, వాట్సాప్‌, ఊబర్‌, ఓలా, శాంసంగ్‌ తదితర సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. యూపీఐ మార్కెట్‌లో యాక్సిస్‌ బ్యాంక్‌ 20 శాతం వాటా కలిగిఉందని బ్యాంక్‌ వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు