83 శాతం పెరిగిన యాక్సిస్‌ బ్యాంక్‌ లాభం

3 Nov, 2018 00:31 IST|Sakshi

మెరుగుపడిన రుణ నాణ్యత

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ యాక్సిస్‌ బ్యాంక్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 83 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.432 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.790 కోట్లకు పెరిగిందని యాక్సిస్‌ బ్యాంక్‌ తెలిపింది. వడ్డీ ఆదాయం అధికంగా ఉండటం, రుణ నాణ్యత మెరుగుపడటంతో మొండి బకాయిలకు కేటాయింపులు తగ్గాయని, దీంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.13,821 కోట్ల నుంచి రూ.15,959 కోట్లకు పెరిగిందని తెలిపింది.  

నికర వడ్డీ ఆదాయం 15 శాతం అప్‌...
నికర వడ్డీ ఆదాయం రూ.2,208 కోట్ల నుంచి 15 శాతం వృద్ధితో రూ.2,542 కోట్లకు పెరిగిందని యాక్సిస్‌ బ్యాంక్‌ తెలిపింది. గత క్యూ2లో 3.12 శాతంగా ఉన్న నికర మొండి బకాయిలు ఈ క్యూ2లో 2.54 శాతానికి తగ్గాయని పేర్కొంది.  అయితే స్థూల మొండి బకాయిలు మాత్రం 5.90% నుంచి 5.96%కి పెరిగాయని వివరించింది. మొండిబకాయిలకు, ఇతరాలకు కేటాయింపులు రూ.3,140 కోట్ల నుంచి 7% తగ్గి రూ.2,927 కోట్లకు తగ్గాయని తెలిపింది.

ఫీజు ఆదాయం 9% పెరిగి రూ.2,376 కోట్లకు పెరిగిందని తెలిపింది. రిటైల్‌ బ్యాంకింగ్‌ సెగ్మెంట్‌ 24 శాతం వృద్ధి చెందడమే దీనికి ప్రధాన కారణమని పేర్కొంది. రుణాలు 11% పెరిగి రూ.4,56,121 కోట్లకు పెరిగాయని తెలిపింది. రిటైల్‌ రుణాలు 20%, ఎస్‌ఎమ్‌ఈ రుణాలు 14 శాతం, కార్పొరేట్‌ రుణాలు 21 శాతం చొప్పున పెరిగాయని వివరించింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్‌ 1.2% లాభంతో రూ.610 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు