యాక్సిస్‌ బ్యాంక్‌ జూమ్‌!

31 Jul, 2018 01:02 IST|Sakshi

అంచనాలను మించిన   ఆర్థిక ఫలితాలు

మూడో క్వార్టర్‌ నుంచి ‘మొండి’ సమస్య సాధారణ స్థాయికి

బ్యాంక్‌ సీఎఫ్‌ఓ శ్రీధరన్‌ వెల్లడి   

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ యాక్సిస్‌ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌ క్వార్టర్‌ ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 46 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.1,306 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.701 కోట్లకు పరిమితమైందని యాక్సిస్‌ బ్యాంక్‌ తెలిపింది. మొండి బకాయిలు బాగా పెరగడంతో  నికర లాభం ఈ స్థాయిలో క్షీణించిందని బ్యాంక్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ జైరామ్‌ శ్రీధరన్‌ చెప్పారు.  అంతకు ముందటి క్వార్టర్‌ (గత ఆర్థిక సంవత్సరం క్యూ4)లో  రూ.2,189 కోట్ల నికర నష్టాలు వచ్చాయని,  ఈ క్వార్టర్‌తో మళ్లీ లాభాల బాట పట్టామని పేర్కొన్నారు. మొత్తం ఆదాయం మాత్రం రూ.14,052 కోట్ల నుంచి రూ.15,702 కోట్లకు ఎగసింది.  

12 శాతం పెరిగిన నికర వడ్డీ ఆదాయం.... 
నికర వడ్డీ ఆదాయం రూ.4,616 కోట్ల నుంచి 12 శాతం వృద్ధితో రూ.5,167 కోట్లకు చేరిందని శ్రీధరన్‌ తెలిపారు. రిటైల్, ఎస్‌ఎమ్‌ఈ రుణాల జోరుతో రుణ వృద్ధి 14 శాతం పెరిగి రూ.6.53 లక్షల కోట్లకు పెరిగిందని తెలిపారు. నికర వడ్డీ మార్జిన్‌ 3.63 శాతం నుంచి 3.46 శాతానికి తగ్గిందని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నికర వడ్డీ మార్జిన్‌ ఇదే రేంజ్‌లో కొనసాగవచ్చని పేర్కొన్నారు.  

మొండి  బాకీలు మరింతగా పెరుగుతాయ్‌.. 
కాగా ఈ బ్యాంక్‌ రుణ నాణ్యత మరింత క్షీణించింది. గత క్యూ1లో 5.03 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ1లో 6.52 శాతానికి పెరిగాయి. అలాగే నికర మొండి బకాయిలు 2.30 శాతం నుంచి 3.09 శాతానికి చేరాయి. అంకెల పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు రూ.22,031 కోట్ల నుంచి రూ.32,662 కోట్లకు, నికర మొండి బకాయిలు రూ.14,902 కోట్లకు చేరాయి. అయితే అంతకుముందటి క్వార్టర్‌లో స్థూల మొండి బకాయిలు  6.77 శాతంగా, నికర మొండి బకాయిలు 3.40 శాతంగా ఉన్నాయి. వచ్చే క్వార్టర్‌లో మొండి బకాయిలు ఒకింత పెరగవచ్చని, ఆ తర్వాత నుంచి సాధారణ స్థాయికి వస్తాయని శ్రీధరన్‌ వివరించారు. తాజా మొండి బకాయిలు 74 శాతం తగ్గి  రూ.4,337 కోట్లకు చేరాయి. మొండి బకాయిలకు కేటాయింపులు రూ.2,342 కోట్ల నుంచి 43 శాతం పెరిగి రూ.3,33ళ8 కోట్లకు చేరాయి. సీక్వెన్షియల్‌గా చూస్తే, కేటాయింపులు 54 శాతం తగ్గాయి. అంతకు ముందటి క్వార్టర్‌లో మొండి బకాయిలకు కేటాయింపులు రూ.7,180 కోట్లకు పెరిగాయి. ఈ క్యూ1లో రికవరీలు, అప్‌గ్రేడ్‌లు రూ.2,917 కోట్లుగా ఉండగా, రూ.3,007 కోట్ల రుణాలను రద్దు చేశామని శ్రీధరన్‌ చెప్పారు.  మార్కెట్‌ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలు బాగా ఉంటాయనే అంచనాలతో బీఎస్‌ఈలో యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్‌ 2.6 శాతం లాభంతో రూ.568 వద్ద ముగిసింది.  

12–13 శాతం రుణ వృద్ధి...
ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ, భారత్‌లో మాత్రం వృద్ధి జోరు కొనసాగుతోందని బ్యాంక్‌ సీఈఓ, ఎమ్‌డీ శిఖా శర్మ వ్యాఖ్యానించారు. భారత్‌లోని పెద్ద కంపెనీలు తమ పెట్టుబడి ప్రణాళికలకు తుదిరూపుని ఇస్తున్నాయని, ఈ ఆర్థిక సంవత్సరంలో 12–13 శాతం రుణ వృద్ధిని సాధించగలమన్న ధీమాను ఆమె వ్యక్తం చేశారు.    

మరిన్ని వార్తలు