యాక్సిస్‌ బ్యాంక్‌ షేరుకు క్యూ1 ఫలితాల జోష్‌..!

22 Jul, 2020 10:22 IST|Sakshi

ట్రేడింగ్‌ ప్రారంభంలోనే షేరు 8శాతం జంప్‌

తొలి త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించడంతో యాక్సిస్‌ బ్యాంక్‌ షేరు బుధవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 8శాతానికి పైగా లాభపడింది. బ్యాంక్‌ నిన్నటి రోజున క్యూ1 ఫలితాలను ప్రకటించింది. మెరుగైన ఫలితాల వెల్లడితో పలు బ్రోకరేజ్‌ సంస్థలు ఈ షేరు టార్గెట్‌ ధరను పెం‍చాయి. ఫలితంగా నేడు బీఎస్‌ఈలో ఈ షేరు 6శాతం లాభంతో రూ.473 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. 

నికరలాభం, ఆదాయం క్షీణించినప్పటికీ.., మొండిబాకీలు తగ్గుముఖం పట్టాయి. స్థూల మొండిబాకీలు (ఎన్‌పీఏ) 5.25 శాతం నుంచి 4.72 శాతానికి దిగివచ్చాయి. అలాగే నికర ఎన్‌పీఏలు 2.04శాతం నుంచి 1.23శాతానికి తగ్గాయి. ఎన్‌పీలు తగ్గుముఖం పట్టడంతో ఆస్తుల నాణ్యత మెరుగైనట్లు బ్యాంక్‌ తెలిపింది. అలాగే జూన్ త్రైమాసికంలో మొండిబాకీలకు కేటాయింపులు గతేడాది క్యూ1తో పోలిస్తే రూ. 3,815 కోట్ల నుంచి రూ. 4,416 కోట్లకు పెరిగినట్లు యాక్సిస్ బ్యాంక్ వెల్లడించింది. ఇక సమీక్షాకాలంలో బ్యాంకు నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఎం) 20 శాతం పెరిగి రూ. 5,844 కోట్ల నుంచి రూ. 6,985 కోట్లకు చేరగా, నికర వడ్డీ మార్జిన్ 3.40 శాతంగా ఉంది. 

మెరుగైన క్యూ1 ఫలితాల వెల్లడి నేపథ్యంలో మార్కెట్‌ ప్రారంభం నుంచే ఈ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఒక దశలో 8శాతానికి పైగా లాభపడి రూ.482.85 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఉదయం 10గంటలకు షేరు క్రితం ముగింపు(రూ.446.20)తో పోలిస్తే 4.50శాతం లాభంతో రూ.466.45 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇక షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.285.00, రూ.765.90గా ఉన్నాయి. 

మరిన్ని వార్తలు