ద్వితీయార్ధం దాకా ఇంతే! 

31 Jan, 2019 04:03 IST|Sakshi

ట్రక్‌ మార్కెట్‌కు యాక్సిల్‌ లోడ్‌ నిబంధనల దెబ్బ

మహీంద్రా ట్రక్‌ అండ్‌ –బస్‌సీఈఓ వినోద్‌ సహాయ్‌

ముంబై, సాక్షి బిజినెస్‌ బ్యూరో: గతేడాది ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త యాక్సిల్‌ లోడ్‌ నిబంధనలు హెవీ, మీడియమ్‌ కమర్షియల్‌ వెహికల్‌ మార్కెట్‌ను కుంగదీశాయని, వీటి ప్రతికూల ప్రభావం ఈ సంవత్సరం రెండో అర్ధభాగం వరకు కొనసాగవచ్చని మహీంద్రా అండ్‌ మహీంద్రా ట్రక్‌ అండ్‌ బస్‌ సీఈఓ వినోద్‌ సహాయ్‌ చెప్పారు. ఈ నిబంధనల వల్ల మీడియం, హెవీ కమర్షియల్‌ వెహికల్‌ అమ్మకాలు దాదాపు 25 శాతం క్షీణించాయన్నారు. నిబంధనల ప్రభావం తమపై కూడా పడిందని, అందుకే గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ క్యూ3లో వ్యాపారం దాదాపు 30– 40 శాతం మేర కుంచించుకుపోయిందని చెప్పారు.

‘‘క్రమంగా ఈ నెగిటివ్‌ ప్రభావం నుంచి మార్కెట్‌ కోలుకుంటోంది. క్యూ4 నాటికి విక్రయాల్లో వృద్ధి తరుగుదల పది శాతానికి పరిమితం కావచ్చు. కొత్త నిబంధనలతో పాత ట్రక్కు యజమానులకు ఊరట లభించింది. దీంతో కొత్త వాహనాల కొనుగోళ్లు గణనీయంగా పడ్డాయి’’ అని వివరించారు. కొత్త యాక్సిల్‌ లోడు నిబంధనల ప్రభావం ఈ ఏడాది ద్వితీయర్ధానికి పూర్తిగా తొలగిపోతే తిరిగి ట్రక్‌ మార్కెట్‌ వృద్ధి బాట పట్టవచ్చని అంచనా వేశారు. బీఎస్‌6 నిబంధనలు అమల్లోకి వస్తే ట్రక్‌ ధరలు రూ.లక్ష నుంచి 3 లక్షల వరకు పెరగవచ్చని చెప్పారు.  

ఐసీవీ విభాగంపై ప్రత్యేక ఫోకస్‌: పవన్‌ గోయింకా 
ఐసీవీ (ఇంటర్‌మీడియరీ కమర్షియల్‌ వెహికల్స్‌) విభాగం ఏటా 15–17 శాతం చక్రీయ వృద్ధి సాధిస్తోందని ఎంఅండ్‌ఎం ఎండీ పవన్‌ గోయింకా చెప్పారు. ఆటో కంపెనీలు హెచ్‌సీవీ (హెవీ కమర్షియల్‌ వెహికల్స్‌) వచ్చిన తరుగుదలను తట్టుకునేందుకు ఐసీవీ, ఎల్‌సీవీ మార్కెట్‌పై ఎక్కువ ఫోకస్‌ పెడుతున్నాయని, అందుకే తామూ ఈ విభాగంలో ప్రవేశించామని తెలిపారు. ఈ విభాగంలో టాప్‌3 కంపెనీలతో (టాటామోటర్స్, అశోక్‌ లేలాండ్, వోల్వో ఐషర్‌) పోటీ పడేలా ఫ్యూరియో ట్రక్‌ మోడల్‌ను డిజైన్‌ చేశామన్నారు.

‘‘దీనిపై రూ.600 కోట్లు వెచ్చించాం. ఐసీవీ విభాగంలో సింగిల్‌ ట్రక్‌ ఓనర్స్‌ ఎక్కువమంది ఉంటారు. వీరిని దృష్టిలో పెట్టుకుని ఈ మోడల్‌ను తెచ్చాం. ప్యూరియోను గతేడాదే ఆవిష్కరించినా, ఆరు నెలలపాటు అన్ని రకాలుగా సమీక్షించామని, ఎటువంటి లోపాలు లేవని నిర్ధారించుకొని మార్కెట్లోకి విడుదల చేశాం’’ అన్నారు. 

మరిన్ని వార్తలు