ఆయుష్మాన్‌ భారత్‌తో ఆరోగ్య బీమా ధీమా 

23 Mar, 2018 01:10 IST|Sakshi

క్రిసిల్‌ నివేదిక వెల్లడి  

ముంబై: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త జాతీయ ఆరోగ్య సంరక్షణ స్కీమ్‌ కారణంగా ఆరోగ్య బీమా 50 శాతానికి పైగా విస్తరిస్తుందని క్రిసిల్‌ తాజా నివేదిక పేర్కొంది. 11 కోట్ల పేద కుటుంబాలకు నేషనల్‌ హెల్త్‌ ప్రొటెక్షన్‌ మిషన్‌ కింద ఆరోగ్య బీమానందించే ఆయుష్మాన్‌ భారత్‌ స్కీమ్‌కు కేంద్ర కేబినెట్‌ బుధవారం లాంఛనంగా ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ఈ స్కీమ్‌కు కేంద్రం వాటాగా రానున్న రెండు ఆర్థిక సంవత్సరాల కోసం రూ.85,200 కోట్ల నిధుల కేటాయింపులకు కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపింది.  11 కోట్ల కుటుంబాలకు ఏడాది పాటు రూ.5 లక్షల ఆరోగ్య బీమాను ఈ స్కీమ్‌ కింద అందించనున్నారు.

ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రకటించిన ఈ స్కీమ్‌లో ఇప్పటివరకూ ఉన్న కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన, సీనియర్‌ సిటిజన్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌లు విలీనమవుతాయి. ప్రస్తుతం ఆరోగ్య బీమా విస్తరణ 33 శాతంగా ఉందని, ఈ ఆయుష్మాన్‌ భారత్‌ స్కీమ్‌ కారణంగా ఈ బీమా విస్తరణ 50 శాతానికి పైగా పెరుగుతుందని క్రిసిల్‌ నివేదిక వివరించింది. ప్రస్తుతం ఆరోగ్య బీమా కవరేజ్‌ 43.8 కోట్లమందికి ఉందని, ఈ స్కీమ్‌తో అది 65 కోట్ల మందికి పెరుగుతుందని పేర్కొంది.    

మరిన్ని వార్తలు