అజీం ప్రేమ్‌జీకి ఫ్రాన్స్‌ అత్యున్నత పురస్కారం 

27 Nov, 2018 01:02 IST|Sakshi

న్యూఢిల్లీ:  ఐటీ దిగ్గజం విప్రో అధిపతి అజీం ప్రేమ్‌జీకి అరుదైన గౌరవం దక్కింది. ఫ్రాన్స్‌ ప్రభుత్వం ఆయనను అత్యున్నత ‘షెవాలీర్‌ డె లా లెజియన్‌ డిఆనర్‌’ (నైట్‌ ఆఫ్‌ ది లెజియన్‌ ఆఫ్‌ ఆనర్‌) పురస్కారంతో సన్మానించనుంది. ఐటీ దిగ్గజంగా భారత ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగానికి, వితరణశీలిగా సమాజానికి చేస్తున్న సేవలకు గాను ఈ పురస్కారం ప్రదానం చేయనున్నట్లు ఫ్రాన్స్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెలాఖరులో జరిగే కార్యక్రమంలో భారత్‌లో ఫ్రాన్స్‌ దౌత్యవేత్త అలెగ్జాండర్‌ జిగ్లర్‌ దీన్ని ఆయనకు అందజేయనున్నట్లు వివరించింది.

ఐటీ దిగ్గజంగానే కాకుండా అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్, విశ్వవిద్యాలయం ద్వారా సమాజ సేవా కార్యక్రమాల్లో కూడా ప్రేమ్‌జీ నిమగ్నమైన నేపథ్యంలో ఫ్రాన్స్‌ పురస్కారం ప్రాధాన్యం సంతరించుకుంది. నవంబర్‌ 28–29 తారీఖుల్లో జరిగే బెంగళూరు టెక్‌ సదస్సులో పాల్గొంటున్న సందర్భంగా జిగ్లర్‌ ఈ పురస్కారాన్ని ప్రేమ్‌జీకి అందజేయనున్నారు.  

మరిన్ని వార్తలు