పతంజలి ‘సూర్య’ మంత్ర

6 Dec, 2017 00:13 IST|Sakshi

సోలార్‌ పరికరాల తయారీపై దృష్టి

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ రంగంలో బలమైన స్థానాన్ని సృష్టించుకున్న బాబా రాందేవ్‌ సంస్థ పతంజలి ఆయుర్వేద్‌ తదుపరి లక్ష్యంగా సోలార్‌ విద్యుత్‌ ఎక్విప్‌మెంట్‌ తయారీని ఎంచుకుంది. గ్రేటర్‌ నోయిడాలో ఇందుకు సంబంధించిన ఫ్యాక్టరీ వచ్చే కొన్ని నెలల్లో కార్యకలాపాలు ప్రారంభిస్తుందని పతంజలి ఆయుర్వేద్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆచార్య బాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ ప్లాంటుపై రూ.100 కోట్ల పెట్టుబడులు పెట్టే ప్రణాళికతో ఉన్నట్టు చెప్పారు. సోలార్‌ విద్యుత్‌ ఎక్విప్‌మెంట్‌ కోసం అధిక శాతం చైనా దిగుమతులపై ఆధారపడుతున్న నేపథ్యంలో, పతంజలి వ్యూహాత్మకంగా ఈ రంగాన్ని ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. సోలార్‌ ద్వారా దేశంలో ప్రతి ఇల్లు కూడా విద్యుత్‌ సరఫరాను అందుకుంటుందని, దాన్ని తాము సాధ్యం చేస్తామని ఆచార్య బాలకృష్ణ పేర్కొనడం దీన్ని సూచిస్తోంది.

కంపెనీ కొనుగోలు..: పతంజలి సోలార్‌ విద్యుత్‌లోకి ప్రవేశించడానికి తొలి అడుగుగా ఈ ఏడాది ఆరంభంలోనే అడ్వాన్స్‌డ్‌ నేవిగేషన్‌ అండ్‌ సోలార్‌ టెక్నాలజీస్‌ అనే సంస్థను కొనుగోలు చేసింది. ఈ సంస్థ నేవిగేషన్‌ ఎక్విప్‌మెంట్‌ తయారీలో ఉంది. ప్రస్తుతం ఈ సంస్థ ఉత్పాదక సామర్థ్యం 120 మెగావాట్లు. కేంద్రంలోని మోదీ సర్కారు 2022 నాటికి 175 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని చేరుకోవాలన్న ప్రణాళికలతో ఉండగా, ఈ అవకాశాలు పతంజలికి కలసిరానున్నాయి. ప్రస్తుతం దేశంలో ఉన్న సామర్థ్యం 60 గిగావాట్లే. మరో ఐదేళ్లలో 175 గిగావాట్లను చేరుకునేందుకు ప్రభుత్వం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ప్రస్తుతం దేశీయ సోలార్‌ మార్కెట్‌లో చైనా ఉత్పత్తులదే ఆధిపత్యం.

మరిన్ని వార్తలు