ఇక నుంచి పతంజలి పాలు.. నీళ్లు

13 Sep, 2018 17:36 IST|Sakshi

న్యూఢిల్లీ : దేశీ ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకొచ్చి ప్రముఖ రిటైల్‌ స్లోర్లకు గట్టి పోటీ ఇస్తున్న బాబా రామ్‌దేవ్‌ తన పతంజలి నుంచి మరో ఐదు ఉత్పత్తులను మార్కెట్‌లోకి తేనున్నట్లు ప్రకటించింది. సమర్థ భారత్‌.. స్వస్థ భారత్‌ మిషన్‌లో భాగంగా పాలు, పాల ఉత్పత్తులు, నిల్వ చేయడానికి వీలున్న కూరగాయాలు, సోలార్‌ ఉత్పత్తులు, డ్రింకింగ్‌ వాటర్‌, పశువుల మేతకు సంబంధించిన ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు బాబా రాందేవ్‌ తన ట్విటర్‌లో ప్రకటించారు. అంతేకాక  2020 ఆర్థిక సంవత్సరానికి గాను దాదాపు 1000 కోట్ల రూపాయల అమ్మకాలు లక్ష్యంగా ఈ ఉత్పత్తులను తీసుకోస్తున్నట్లు బాబా రామ్‌దేవ్‌ తెలిపారు. దీని ద్వారా మరో 20 వేల మందికి ఉపాధి కల్పించనున్నట్లు ప్రకటించారు.

అంతేకాక తన స్టోర్ల ద్వారా నిత్యం 10లక్షల లీటర్ల పాల అమ్మకాలు లక్ష్యంగా పెట్టుకున్నామని రామ్‌దేవ్‌ తెలిపారు. పాలతో పాటు, పన్నీర్‌, పెరుగు లాంటి ఇతర పాల ఉత్పత్తులను సైతం విక్రయించనున్నట్లు ప్రకటించారు. పాడి పరిశ్రమ రైతులను మరింత ప్రోత్సహించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఇతర సంస్థలు విక్రయించే పాలకన్నా 2 రూపాయలు తక్కువకే పాలను విక్రయిస్తామని స్పష్టం చేశారు. అలాగే ‘దివ్య జల్‌’ పేరుతో తీసుకోస్తున్న ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌  250 ఎమ్‌ఎల్, 500 ఎమ్‌ఎల్, 1 లీటరు, 2 లీటర్లు, 5 లీటర్లు, 20 లీటర్ల ప్యాక్ పరిమాణంలో అందుబాటులో ఉంటుందని తెలిపారు. హరిద్వార్‌ ప్రధాన కేంద్రంగా కార్యాకలాపాలను నిర్వహిస్తున్న పతంజలి దేశవ్యాప్తంగా 56వేల రిటైల్‌ స్టోర్లను కలిగి ఉంది.

మరిన్ని వార్తలు