సొంతింటికి వేదిక.. బాచుపల్లి!

6 Feb, 2016 02:45 IST|Sakshi
సొంతింటికి వేదిక.. బాచుపల్లి!

శాటిలైట్ టౌన్‌షిప్, ఎడ్యుకేషన్ హబ్‌గా అభివృద్ధి..
కూతవేటు దూరంలో కేజీ టు పీజీ విద్యా సంస్థలు
నాలుగేళ్లలో 40 శాతం పెరిగిన స్థిరాస్తి ధరలు

సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. ఎవరైనా సరే సొంతిల్లు కొనేముందు ప్రధానంగా చూసేవి 4 అంశాలే. అవేంటంటే..
1. పిల్లల పాఠశాలలకు దగ్గరుందా?
2. అనారోగ్య సమస్యలెదురైతే ఆసుపత్రులున్నాయా?
3. పనిచేసే కార్యాలయాలకు దగ్గరుందా?
4. కుటుంబంతో వెళ్లేందుకు షాపింగ్ కేంద్రాలున్నాయా అనే
!

 .. అయితే సాధారణంగా ఈ వసతులున్న ఏ ప్రాంతంలోనైనా స్థిరాస్తి ధరలు ఆకాశాన్నంటుతాయి. కానీ, నేటికీ అందుబాటు ధరల్లో, లగ్జరీ వసతులనందిస్తూ.. సొంతింటి కలను తీరుస్తోంది బాచుపల్లి. పైన చెప్పినట్లు నాలుగంశాలే కాదు.. 6 కి.మీ. దూరంలో మియాపూర్, నిజాంపేట్ ప్రాంతాలుండటం, 2 కి.మీ. దూరంలో ఓఆర్‌ఆర్ చేరుకునే వీలుండటం బాచుపల్లి ప్రాంతానికి కలిసొచ్చే అంశాలని చెప్పాలి.

 సాక్షి, హైదరాబాద్: సూరారం సబ్ రిజిస్ట్రేషన్ శాఖ పరిధిలో బాచుపల్లితో పాటూ సూరారం, బోరంపేట, దుండిగల్, గాగిల్లాపూర్, మల్లంపేట్, నిజాంపేట్, పేట్ బషీరాబాగ్, కుత్బుల్లాపూర్, నందానగర్, నాగులూరు, శంబిపూర్, ప్రగతినగర్, గాజుల రామారం, జీడిమెట్ల ప్రాంతాలొస్తాయి. బాచుపల్లి ప్రాంతం గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇదో ఎడ్యుకేషన్ హబ్. బాచుపల్లి చుట్టూ 5-10 కి.మీ. పరిధిలో కేజీ నుంచి పీజీ వరకు అన్ని వర్గాల వారికి అనువైన విద్యా సంస్థలున్నాయి. ఓక్రిడ్జ్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, గీతాంజలి, శ్రీ చైతన్య, గాయత్రి, అభ్యాస్, భాష్యం, నారాయణ, గోకరాజు రంగరాజు, వీఎన్‌ఆర్, బీవీఆర్‌ఐటీ వంటి అన్ని రకాల విద్యా సంస్థలున్నాయిక్కడ. నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు వర్శిటీకి బాచుపల్లిలో 100 ఎకరాల స్థలాన్ని కేటాయించారు కూడా. ఔటర్ రింగ్ రోడ్డును ఆధారంగా చేసుకుని మరిన్ని విద్యా, వైద్యం, వినోద సంస్థలూ రానున్నాయి.

వైద్యం, రవాణాలకూ దగ్గరే..
ప్రస్తుతం బాచుపల్లిలో మల్టీనేషనల్ ఆసుపత్రులు, భారీ షాపింగ్ మాళ్లు పెద్దగా లేవు. వీటి కోసం 6 కి.మీ. దూరంలో ఉన్న  నిజాంపేట్, మియాపూర్‌లోని కార్పొరేట్, మల్టీనేషనల్ ఆసుపత్రులపైనే ఆధారపడాల్సి వస్తుంది. అయితే బాచుపల్లి నుంచి నిజాంపేట్‌కు వెళ్లే రోడ్‌లో 27 ఎకరాల్లో కత్రియా ఆసుపత్రి నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఇందులో సుమారు 1,000 పడకలు అందుబాటులో ఉంటాయని సమాచారం. రవాణా సౌకర్యాల విషయానికొస్తే.. దేశంలోనే అతిపెద్ద బస్ టెర్మినల్ బాచుపల్లికి 3 కి.మీ. దూరంలోనే ఉంటుంది. మియాపూర్‌లో 55 ఎకరాల్లో ఇంటర్ సిటీ బస్ టెర్మినల్ (ఐసీబీటీ) ఉంది. ఇందులో 200 డిస్ట్రిక్ట్, 30 సిటీ బస్ బేలుంటాయి. బాచుపల్లి నుంచి 10 కి.మీ. దూరంలో హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఉంటుంది. మియాపూర్ మెట్రో స్టేషన్ పూర్తయ్యాక.. దాన్ని బాచుపల్లి వరకూ విస్తరణ చేయాలనేది ప్రభుత్వ యోచన. ప్రస్తుతం బాచుపల్లిలో మంజీరా మంచినీరు సరఫరా అవుతోంది. గోదావరి జలాలు కుత్బుల్లాపూర్ వరకొచ్చాయి. 2-3 ఏళ్లలో బాచుపల్లి కూడా వస్తాయనేది అధికారుల మాట.

 35-40 శాతం వృద్ధి: ‘‘ఐటీ కారిడార్‌కు దగ్గర్లో ఉండటం వల్ల బాచుపల్లిలో స్థిరాస్తి రంగానికి మంచి అవకాశముంది. బాచుపల్లి నుంచి 10 కి.మీ. దూరంలో హైటెక్ సిటీ, 13 కి.మీ. దూరంలో గచ్చిబౌలి ప్రాంతాలున్నాయి. ఎగువ మధ్యతరగతి వారికి లగ్జరీ అపార్ట్‌మెంట్లు, సంపన్న వర్గాల వారికి విల్లాలు.. ఇలా ఇద్దరికీ అనుకూలమైన ప్రాజెక్ట్‌లున్నాయిక్కడ. అందుకే నాలుగేళ్లలో ఇక్కడి స్థిరాస్తి ధరలు 35-40 శాతం మేర పెరిగాయని’’ ప్రణీత్ గ్రూప్ ఎండీ నరేంద్ర కుమార్ చెప్పారు. ఇక్కడి మౌలిక, రవాణా సదుపాయాలు చూస్తుంటే సమీప భవిష్యత్తులో కేపీహెచ్‌బీ లాగే బాచుపల్లి ప్రాంతం శాటిలైట్ టౌన్‌షిప్‌గా అభివృద్ధి చెందుతుందనడంలో సందేహం లేదు. బాచుపల్లిలో స్థిరాస్తి ధరల విషయానికొస్తే.. అపార్ట్‌మెంట్‌లో ధర చ.అ.కు రూ.2,800-3,500,స్థలమైతే గజానికి రూ.15-20 వేలు, విల్లా ధరలు రూ.60 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి.

మరిన్ని వార్తలు