కార్పొరేట్ల పన్ను రాయితీలు వెనక్కి..

10 Sep, 2015 01:31 IST|Sakshi
కార్పొరేట్ల పన్ను రాయితీలు వెనక్కి..

దశలవారీగా తొలగింపు; త్వరలో జాబితా విడుదల చేస్తాం
- నల్లధనంపై వెనక్కితగ్గం...
- వచ్చే ఏప్రిల్ నుంచి జీఎస్‌టీ అమలు లక్ష్యం
- ఇండియా సమిట్-2015లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ:
కార్పొరేట్ రంగానికి ఇస్తున్న పన్ను మినహాయింపులను దశలవారీగా తొలగించనున్నామని.. వీటికి సంబంధించి కొద్ది రోజుల్లోనే ఒక జాబితాను విడుదల చేయనున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. కార్పొరేట్ పన్నును నాలుగేళ్లలో ఇప్పుడున్న 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించనున్నట్లు ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రకటించిన నేపథ్యంలో దీనికి అనుగుణంగానే పన్ను రాయితీలను వెనక్కితీసుకోనున్నామని ఆయన పేర్కొన్నారు. బుధవారమిక్కడ ‘ఇండియా సమిట్-2015’ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. బ్రిటన్‌కు చెందిన ఎకనమిస్ట్ మ్యాగజీన్ ఈ సదస్సును నిర్వహించింది. ‘వచ్చే నాలుగేళ్లలో కార్పొరేట్ పన్నును 5 శాతం తగ్గిస్తున్నాం. దీంతో ఇప్పటివరకూ ఇస్తున్న పన్ను మినహాయింపులు క్రమంగా తొలగిపోనున్నాయి. ఇందులో తొలి దశ జాబితాను త్వరలోనే ప్రకటించనున్నాం. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పన్నుల మదింపు, రిటర్నుల వ్యవస్థను సరళీకృతం చేయడమే ఈ చర్యల ముఖ్యోద్దేశం’ అని జైట్లీ వివరించారు.
 
నల్లధనంపై పట్టు సడలించం...
విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని భారత్‌కు రప్పించడంలో ప్రభుత్వం వెనకడుగువేసే ప్రసక్తే లేదని కూడా ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. ఈ విషయంలో తాము పట్టు సడలించలేదని కూడా తేల్చిచెప్పారు. నల్లధనం సమస్య కొంతమంది వ్యక్తులకు సంబంధించిందని.. అందుకే దీన్ని వ్యవస్థలోకి తెచ్చేవరకూ సర్కారు చాలా కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. ‘నల్లధనానికి చెక్ చెప్పేందుకు ఇప్పటికే మేం చట్టాన్ని తీసుకొచ్చాం. దీని ప్రకారం ఎవరైనా సరే 90 రోజుల్లో విదేశాల్లోని తమ అక్రమ ఆస్తులను వెల్లడించడం ద్వారా... 60 శాతం వరకూ పన్ను, జరిమానాలను చెల్లించి, బయటపడేందుకు ప్రత్యేకమైన సదుపాయాన్ని(విండో) కూడా కల్పించాం. ఈ నెలాఖరుతో అవకాశానికి తెరపడుతుంది. ఆతర్వాత 120 శాతం జరిమానా, పన్నులతో పాటు 10 ఏళ్ల వరకూ జైలు శిక్ష కూడా తప్పదు’ అని జైట్లీ పేర్కొన్నారు.
 
ఇంకా పలు అంశాలపై ఆయనేమన్నారంటే...
- పేమెంట్ బ్యాంకులు, జనధన యోజన వంటి పలు స్కీమ్‌ల లక్ష్యం... బ్యాంకింగ్ వ్యవస్థను మరింత విస్తృతం చేసి, అందరికీ ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావడమే.
- వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి వస్తు-సేవల పన్ను(జీఎస్‌టీ)ని అమలు చేయాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉంది. అయితే, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్లమెంట్‌ను స్తంభింపజేస్తుండటంతో దీనికి సమస్యలు తలెత్తుతున్నాయి. పార్లమెంటు సజావుగా సాగకుండా ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి. అయితే, త్వరలోనే ఈ ప్రతిష్టంభనకు తెరపడి, బిల్లు పాస్ అవుతుందని భావిస్తున్నా.
- ప్రభుత్వం జారీ చేసే ప్రతి పన్ను డిమాండ్‌నూ పన్ను ఉగ్రవాదం(ట్యాక్స్ టైజం)గా చిత్రీకరించడం తగదు. చాలావరకూ వాటికి చట్టబద్ధత ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
- విదేశాల నుంచి చౌక దిగుమతుల వెల్లువ నుంచి దేశీ ఉక్కు రంగాన్ని కాపాడేందుకు త్వరలో మరిన్ని చర్యలు ఉంటాయి. చైనా, కొరియా, జపాన్, రష్యాల నుంచి వచ్చిపడుతున్న స్టీల్ దిగుమతులపై డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సేఫ్‌గార్డ్స్(డీజీఎస్) ఇప్పటికే దృష్టిపెట్టింది.
 
బలహీన బ్యాంకుల విలీనమే!
ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంపై జైట్లీ పెదవి విప్పారు. ‘ప్రభుత్వం తగినవిధంగా చేయూతనందిస్తున్నప్పటికీ.. ఇంకా బలహీన స్థితిలోనే(తీవ్ర మొండిబకాయిలు-ఎన్‌పీఏ) ఉండే కొన్ని బ్యాంకులను పటిష్టమైన ఇతర పీఎస్‌యూ బ్యాంకుల్లో విలీనం చేసేవిధంగా తదుపరి చర్యలు ఉంటాయి’ అని ఆయన పేర్కొన్నారు. బ్యాంకింగ్ రంగంలో ఎన్‌పీఏల సమస్య ఆందోళనకరమైన విషయమే అయినప్పటికీ.. మరీ అంత భయపడాల్సిన పనేమీలేదని జైట్లీ చెప్పారు.

‘పీఎస్‌యూల బ్యాంకుల బలోపేతానికి మూలధనం పెంపు సహా అనేక చర్యలు చేపడుతున్నాం. ప్రభుత్వ వాటాను 52 శాతానికి తగ్గించుకోవడం ద్వారా మరిన్ని నిధులు బ్యాంకులకు లభిస్తాయి. అప్పటికీ ఇంకా బలహీనంగానే ఉండే బ్యాంకులను పటిష్టమైన బ్యాంకుల్లో విలీనం చేయక తప్పదు’ అని జైట్లీ వివరించారు. ఈ ఏడాది మార్చి నాటికి పీఎస్‌యూ బ్యాంకుల స్థూల ఎన్‌పీఏలు మొత్తం రుణాల్లో 5.2 శాతంగా నమోదయ్యాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా