మూడున్నరేళ్లకే కొత్త స్పోర్ట్స్ బైక్..

11 Mar, 2016 00:38 IST|Sakshi
మూడున్నరేళ్లకే కొత్త స్పోర్ట్స్ బైక్..

బజాజ్ ఆటో(మోటార్‌సైకిల్) ప్రెసిడెంట్ ఎరిక్ వాస్
నూతన మోడళ్లకు సై అంటున్న కుర్రకారు
సగటు ధర ఏటా 25 శాతం పెరుగుదల

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కుర్రకారే కాదు... రైడర్లందరికీ స్పోర్ట్స్ బైక్‌లంటే మహా క్రేజ్. బైక్‌పై ఎంత వేగంగా వెళ్తున్నారో.. యూత్ అంతకంటే వేగంగా వాహనాన్ని మార్చేస్తున్నారట. 100 సీసీ బైక్‌ను తొలిసారిగా కొన్న వ్యక్తి ఎంత కాదన్నా సగటున ఆరేళ్లపాటు అట్టిపెట్టుకుంటున్నారు. అదే 150 సీసీ ఆపైన సామర్థ్యమున్న స్పోర్ట్స్ బైక్‌ల విషయంలో మూడున్నరేళ్లకే మార్చేస్తున్నారు. అంతేకాదు కాస్త ఖరీదైనా ఫర్వాలేదు అధిక సామర్థ్యమున్న మోడల్‌కు సై అంటున్నారని బజాజ్ ఆటో మోటార్‌సైకిల్ బిజినెస్ ప్రెసిడెంట్ ఎరిక్ వాస్ చెబుతున్నారు. బజాజ్ ‘వి’ బైక్‌ను హైదరాబాద్ మార్కెట్లో గురువారం విడుదల చేసిన సందర్భంగా సాక్షి బిజినెస్ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలను తెలియజేశారు. విశేషాలు ఆయన మాటల్లోనే..

 మాంద్యం లేని విభాగం..
నాలుగేళ్లుగా మోటార్‌సైకిళ్ల విపణిలో ఎకానమీ ప్రభావంతో ఆశించిన స్థాయిలో అమ్మకాలు నమోదు కాలేదు. 2015-16 ఏప్రిల్-ఫిబ్రవరి కాలంలో 3 శాతం తిరోగమన వృద్ధి నమోదైంది. అయితే స్పోర్ట్స్ మోటార్‌సైకిళ్ల అమ్మకాల్లో మాత్రం ఏమాత్రం తగ్గుదల లేదు. ఈ విభాగంలో నెలకు 1,80,000 వాహనాలు అమ్ముడవుతున్నాయి. పరిశ్రమ వృద్ధి రేటు ఏటా 10 శాతంగా ఉంది. 15 ఏళ్లుగా అగ్రస్థానంలో ఉన్న బజాజ్‌కు స్పోర్ట్స్ కేటగిరీలో 35 శాతంపైగా వాటా ఉంది. పైగా 17 శాతం వృద్ధి నమోదు చేశాం. ఇక స్పోర్ట్స్ బైక్‌ను ఆరేళ్ల క్రితం వరకు అయిదేళ్లపాటు అట్టిపెట్టుకున్న యజమానులు ఇప్పుడు మూడున్నరేళ్లకే మారుస్తున్నారు. పైగా అధిక ధర వెచ్చించి కొత్త మోడళ్లను కైవసం చేసుకుంటున్నారు. కొనుగోలు చేస్తున్న బైక్ సగటు ధర ఏటా 25 శాతం అధికమవుతోందంటే రైడర్లు ఖరీదుకు వెనుకాడడం లేదని సుస్పష్టమవుతోంది. ఏడాది క్రితం వరకు అవెంజర్ బైక్‌లు నెలకు 4,000 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇప్పుడు ఈ సంఖ్య 20 వేలకుపైమాటే ఉండడం ఇందుకు ఉదాహరణ.

 కొత్త సెగ్మెంట్‌గా ‘వి’..
ద్విచక్ర వాహనాల్లో స్టాండర్డ్, యూత్‌ఫుల్, స్పోర్ట్ విభాగాలుంటాయి. స్టాండర్డ్, యూత్‌ఫుల్ బైక్ నుంచి అప్‌గ్రేడ్ అవ్వాలనుకునే వారందరూ స్పోర్ట్స్ కోరుకోరు. అందుకే ‘వి’ బైక్‌ను తీసుకొచ్చాం. ధ్రుఢంగా, వెడల్పుగా ఉన్న బాడీతోపాటు ఇంజన్‌సహా పూర్తి కొత్తగా రూపొందించాం. దీని అభివృద్ధికి రెండేళ్లకుపైగా సమయం పట్టింది. గంటకు 50-70 కిలోమీటర్ల స్పీడ్‌తో వెళ్లే వారికి అనువైంది. మైలేజీ నగర రోడ్లపై 55-60 కిలోమీటర్లు ఇస్తుంది. పైగా విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్ మెటల్‌ను ఇందులో వాడాం. ఇది కొత్త విభాగాన్ని సృష్టిస్తుంది. నెలకు 50 వేల యూనిట్లు విక్రయించాలని లక్ష్యంగా చేసుకున్నాం. ధర ప్రకటించక ముందే 5,000లకుపైగా బుకింగ్స్ నమోదయ్యాయి. హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో ‘వి’ ధర రూ.62,310. విక్రాంత్ మెటల్ అయిపోయినప్పటికీ ఈ మోడల్‌ను కొనసాగిస్తాం. పలు దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. త్వరలోనే ఎగుమతులను ప్రారంభిస్తాం.

 మార్కెట్‌కు అనుగుణంగా..
ఈ ఏడాది కొత్త విభాగాలను ప్రవేశపెడతాం. కస్టమర్లను ఆకట్టుకునే రీతిలో మోడళ్లను తీసుకొస్తాం. వేటిని విడుదల చేయాలన్నది ప్రణాళిక సిద్ధంగా ఉంది. అయితే అభివృద్ధి చేసిన అన్ని మోడళ్లను ప్రవేశపెట్టాలని ఏమీ లేదు. మార్కెట్ తీరునుబట్టే నిర్ణయం తీసుకుంటాం. మోటార్ సైకిల్ కంపెనీగా అన్ని విభాగాల్లోనూ ప్రవేశిస్తాం. అధిక సామర్థ్యమున్న మోడళ్లూ రానున్నాయి. ప్లాటినా బైక్ మైలేజీ మరింత పెంచే దిశగా పరిశోధన కొనసాగుతోంది. ఇక ఈ ఏడాది ద్విచక్ర వాహన విపణి  తిరిగి గాడిలో పడుతుందన్న అంచనాలున్నాయి. వాతావరణం అనుకూలిస్తుంది. నిర్మాణ, మౌలిక రంగంలో కదలిక ఉంటుంది. రెండేళ్లుగా స్తబ్దుగా ఉన్న గ్రామీణ ఎకానమీ తిరిగి పుంజుకుంటుంది. దీని ప్రభావంతో అమ్మకాలు గణనీయంగా ఉంటాయని ఆశిస్తున్నాం.

>
మరిన్ని వార్తలు