ఇప్పుడు బజాజ్‌ ఆటో వంతు

22 Dec, 2016 01:17 IST|Sakshi
ఇప్పుడు బజాజ్‌ ఆటో వంతు

జనవరి నుంచి రూ.1,500 వరకు వాహన ధరల పెంపు
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘బజాజ్‌ ఆటో’ తాజాగా వాహన ధరలను రూ.700 నుంచి రూ.1,500 శ్రేణిలో పెంచుతున్నట్లు ప్రకటించింది. తాజా నిర్ణయం జనవరి నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. ధరలపెంపునకు ఉత్పత్తి వ్యయం పెరుగుదల కారణమని వివరించింది. ‘దేశంలోని టూవీలర్‌ కంపెనీలన్నీ వాటి వాహనాలను బీఎస్‌–4 నిబంధనలకు అనుగుణంగా అప్‌గ్రేడ్‌ చేస్తున్నాయి. ఇందుకోసం వచ్చే ఏడాది ఏప్రిల్‌నెలను టార్గెట్‌గా పెట్టుకున్నాయి. ఇతర కంపెనీల కన్నా ముందే మేమే ఈ మార్క్‌ను చేరుకోవాలని భావిస్తున్నాం’ అని బజాజ్‌ ఆటో ప్రెసిడెంట్‌ (మోటార్‌ సైకిల్‌ విభాగం) ఎరిక్‌ వాస్‌ తెలిపారు.

కొన్ని మోడళ్లను ఇప్పటికే బీఎస్‌–4 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించామని, మిగిలిన వాటిని కూడా వచ్చే నెలలో బీఎస్‌–4 ప్రమాణాలకు అనువుగా అప్‌గ్రేడ్‌ చేస్తామని వివరించారు. ఈ అంశం కూడా వాహన ధరలపెంపుపై ప్రభావం చూపిందన్నారు. ప్రస్తుతం భారత్‌లో టూవీలర్‌ వాహనాలు బీఎస్‌–3 ప్రమాణాలకు అనుగుణంగా నడుస్తున్నాయి. కాగా హ్యుందాయ్, నిస్సాన్, రెనో, టయోటా, టాటా మోటార్స్, మెర్సిడెస్‌ బెంజ్‌ వంటికంపెనీలు కూడా వాహన ధరలను జనవరి నుంచి పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి.

>
మరిన్ని వార్తలు