బజాజ్‌ ఆటో క్యూ4 లాభం రూ.1,175 కోట్లు

19 May, 2018 01:02 IST|Sakshi

36 శాతం వృద్ధి

ఒక్కో షేర్‌కు రూ.60 డివిడెండ్‌   

న్యూఢిల్లీ: టూ వీలర్‌ దిగ్గజం, బజాజ్‌ ఆటో 2017–18 నాలుగో క్వార్టర్‌లో రూ.1,175 కోట్ల నికర లాభం సాధించింది. 2016–17 ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం రూ.862 కోట్లతో పోలిస్తే 36 శాతం వృద్ధి సాధించామని బజాజ్‌ ఆటో తెలిపింది.

అన్ని సెగ్మెంట్లలో అమ్మకాలు జోరుగా ఉండటంతో ఈ స్థాయిలో నికర లాభం సాధించినట్లు తెలిపింది. మొత్తం ఆదాయం రూ.5,213 కోట్ల నుంచి రూ.6,773 కోట్లకు పెరిగింది.  మొత్తం అమ్మకాలు 7.88 లక్షల నుంచి 10.45 లక్షలకు పెరిగాయి. మోటార్‌బైక్‌ల విక్రయాలు 7 లక్షల నుంచి 22 శాతం వృద్ధితో 8.5 లక్షలకు ఎగిశాయి. ఒక్కో షేర్‌కు రూ.60 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపింది.

మొత్తం ఆదాయం రూ.25,563 కోట్లు
పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.4,079 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.4,219 కోట్లకు పెరిగింది. మొత్తం ఆదాయం రూ.23,088 కోట్ల నుంచి రూ.25,563 కోట్లకు చేరుకుంది.

మొత్తం వాహన విక్రయాలు 36.65 లక్షల నుంచి 33 శాతం వృద్ధితో 40 లక్షలకు పెరిగాయని, మోటార్‌ బైక్‌ల అమ్మకాలు 32.19 లక్షల నుంచి 5 శాతం వృద్ధితో 33.7 లక్షలకు చేరిందని కంపెనీ తెలియజేసింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఈ షేర్‌ మంచి లాభాలు సాధించినప్పటికీ, చివరకు 1.4 శాతం నష్టంతో రూ.2,778 వద్ద ముగిసింది. గురువారం రూ.2,819 వద్ద ముగిసిన ఈ షేర్‌ శుక్రవారం రూ.2,701, రూ.2,942 కనిష్ట, గరిష్ట స్థాయిలను తాకింది.

మరిన్ని వార్తలు